కరోనా వచ్చి తగ్గిన వాళ్లతో పాటు.. ప్రజలంతా స్వచ్ఛందంగా టీకాలు వేయించుకోవాలని అమెరికా అంటువ్యాధుల నియంత్రణ, నివారణ కేంద్రం(సీడీసీ) సూచించింది. తమ వంతు కోసం వేచిచూడకుండా వ్యాక్సిన్ కోసం సిద్ధంగా ఉండాలని కోరింది.
టీకా తీసుకోవాల్సిందే..
వైరస్ నుంచి కోలుకున్నప్పటికీ రోగనిరోధక శక్తి ఎన్నాళ్లుంటుందో అంచనా వేయలేమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వైరస్ నుంచి కోలుకున్నప్పటికీ ఈ సందర్భంలో రోగనిరోధక శక్తి ఎంత బలమైనదన్న విషయం శాస్త్రవేత్తలకు సైతం తెలియదని.. ఈ తరుణంలో టీకా తీసుకోవాల్సిందేనని అభిప్రాయపడుతున్నారు.
"ఇంతకముందు కరోనా వచ్చి తగ్గింది.. నాకేం కాదు అని అశ్రద్ధ చేయవద్దు. రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉన్నా.. పూర్తిగా కోలుకున్నామని భావించినా సరే.. కరోనా టీకా తీసుకోవాలా? అనే ప్రశ్న రానివ్వొద్దు."
డా.అమేష్ అదల్జా, జాన్ హాప్కిన్స్ అంటువ్యాధుల నిపుణుడు.
రోగ నిరోధక వ్యవస్థకు దన్ను..
వ్యాక్సిన్లనేవి మానవ రోగ నిరోధక వ్యవస్థను స్థిరంగా ఉంచేందుకు దోహదపడతాయని అమెరికాలోని బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్లో అంటువ్యాధుల నిపుణుడు డా. ప్రతీక్ కులకర్ణి వివరించారు. టీకా తీసుకుంటే మనం కోల్పోయేదేమీ ఉండదని.. పైగా లాభపడతామని ఆయన అభిప్రాయపడ్డారు.
గత మూడు నెలల్లో కరోనా బారిన పడనివారు టీకా తీసుకునేందుకు ఆలస్యం చేసినా ఫరవాలేదని.. దానివల్ల ఇతరులకు వ్యాక్సిన్ త్వరగా అందుతుందని సీడీసీ తెలిపింది. అయితే టీకా విషయంలో ఉన్న అపోహలను మాత్రం తొలగించుకోవాలని సూచించింది.
ఇదీ చదవండి: అమెరికా 'జూ'లో గొరిల్లాలకు కరోనా