భారత్లో కరోనా విజృంభణ కారణంగా వ్యాక్సిన్ డోసులకు కొరత ఏర్పడిందని కొవాక్స్ నిర్వాహకులు వెల్లడించారు. జూన్ చివరి నాటికి 19 కోట్ల డోసులకు కొరత ఏర్పడుతుందని పేర్కొన్నారు. దక్షిణాసియా దేశాల్లో వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉందన్నారు. ఈ విషయంపై డబ్ల్యూహెచ్ఓ, యూనిసెఫ్, గావీ, సీఈపీఐ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.
"కొవాక్స్ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు సుమారు 7 కోట్ల డోసులను 126 దేశాల్లో పంపిణీ చేశాము. అయితే రెండో దశ పంపిణీపై ప్రస్తుతం భారత్లో ఉన్న వైరస్ వ్యాప్తి ప్రభావం చూపనుంది. ఈ కొరతను తీర్చేందుకు ప్రపంచ దేశాలు టీకాలను అందించాలి. అధిక శాతం టీకా పంపిణీ జరిగిన దేశాలు.. కొన్ని డోసులను ఇతర దేశాలకు అందించాలి. ఈ ఏడాదిలోగా కనీసం 100 కోట్ల డోసులను అయినా కొవాక్స్ పంపిణీ చేయాలి."
-కొవాక్స్ సంయుక్త ప్రకటన
డబ్ల్యూహెచ్ఓ, యూనిసెఫ్ సహా పలు సంస్థల ఆధ్వర్యంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో కొవాక్స్ కార్యక్రమం ప్రారంభమయింది. ఈ ఏడాది చివరి నాటికి 200 కోట్ల వ్యాక్సిన్లు పంపిణీ చేయాలని కొవాక్స్ లక్ష్యంగా పెట్టుకుంది.
ఇదీ చదవండి : చైనాకు మిత్ర దేశాలు లేవు: అమెరికా