అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మృత్యు మృదంగం మోగిస్తోంది. వైరస్ దెబ్బకు ఆ దేశంలో ఇప్పటికే 23,000 మందికి పైగా మరణించారు. అయితే- ఇది అధికారిక లెక్క మాత్రమేనని.. వాస్తవ మరణాల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు విశ్లేషకులు. అమెరికా వ్యాప్తంగా నర్సింగ్ హోంలు, దీర్ఘకాలిక చికిత్సా కేంద్రాల్లో కరోనా సోకి ఇప్పటివరకు 3,600 మందికి పైగా మరణించారని వారు చెప్పారు. ఈ మృతుల సంఖ్యను అధికారిక గణాంకాల్లో అధికారులు కలిపి చూపించడం లేదని తెలిపారు. తాజాగా అధికార వర్గాలు ఈ విషయాన్ని ధ్రువీకరించడం కలకలం సృష్టిస్తోంది.
నర్సింగ్హోంల్లో మృతులు..
రెండు వారాల క్రితం వరకు అమెరికాలోని నర్సింగ్ హోంలు, దీర్ఘకాలిక చికిత్సా కేంద్రాల్లో కరోనా దెబ్బకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 450గా ఉంది. ప్రస్తుతం అది 3,621కి పెరిగింది. దేశవ్యాప్తంగా ఈ కేంద్రాల్లో 10 లక్షల మందికిపైగా ఉంటున్నట్లు అంచనా. వారిలో ఎక్కువమంది వృద్ధులే. వైద్య సిబ్బంది కొరత, పర్యవేక్షణ లేమి వంటివి ఈ కేంద్రాల్లో వైరస్ వ్యాప్తికి ఊతమిస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
పరీక్షలకు డిమాండ్
వర్జీనియాలోని రిచ్‌మాండ్‌లోని ఓ నర్సింగ్ హోంలో ఇప్పటికే 42 మంది కరోనా దెబ్బకు మృతిచెందారు. 100 మందికిపైగా వైరస్ బారిన పడ్డారు. సెంట్రల్ ఇండియానాలోని మరో నర్సింగ్ హోంలో 24 మంది మరణించారు. సియాటిల్‌లోని కిర్క్‌లాండ్‌లో ఉండే ఓ కేంద్రంలో 43 మంది ప్రాణాలను వైరస్ బలిగొంది. ఒక్క న్యూయార్క్‌లోనే ఇలాంటి కేంద్రాల్లో 1,880 మంది వరకు మృతిచెందారని తెలుస్తోంది. ఈ కేంద్రాల్లో కొవిడ్ బాధితుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వాటిలో వ్యాధి నిర్ధారణ పరీక్షలను విస్తృతంగా చేపట్టాలని కోరుతున్నారు.
ట్రంప్ స్నేహితుడి మృత్యువాత
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్నేహితుడు, స్థిరాస్తి వ్యాపార రంగ దిగ్గజం స్టాన్లీ చెరా కరోనా బారిన పడి మరణించారు. ట్రంప్ అధ్యక్ష ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు చెరా దాతగా దాతగా వ్యవహరించారు. ఆయన న్యూయార్క్‌కు చెందినవారు.
ఇదీ చూడండి: ఫౌచి ఉద్వాసనకు సమయం ఆసన్నమైందా?