మానవ రోగ నిరోధక వ్యవస్థను కరోనా వైరస్ బోల్తా కొట్టిస్తున్న తీరును అమెరికా శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. వైరస్ జన్యుక్రమం.. మన శరీరంలో అంతర్భాగమేనని భ్రమింపచేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఒక ఎంజైమ్‌ను వారు గుర్తించారు. దాని నిర్మాణాన్ని వారు వెలుగులోకి తెచ్చారు. ఈ బృందానికి భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త యోగేశ్ గుప్తా నేతృత్వం వహించారు. కొవిడ్-19 చికిత్స కోసం కొత్త రకం యాంటీవైరల్ ఔషధాలను అభివృద్ధి చేయడానికి ఈ పరిశోధన వీలు కల్పిస్తుంది.
రోగ నిరోధక ప్రతిస్పందన
ఎన్‌ఎస్‌పీ-10 అనే ప్రొటీన్.. వైరల్ ఎంఆర్‌ఎన్‌ఏల (ప్రొటీన్ల ఉత్పత్తి కేంద్రాలకు జన్యుకోడ్‌లను పంపే వ్యవస్థ)లకు మార్పు చేసి, అవి మానవ ఎంఆర్‌ఎన్‌ఏలా కనిపించేలా చూస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ మార్పు ద్వారా మానవ రోగ నిరోధక వ్యవస్థ ప్రతిస్పందన నుంచి వైరస్‌ను రక్షిస్తుందని చెప్పారు.
"ఎన్‌ఎస్‌పీ-10 ప్రయోగించే ఈ కిటుకు వల్ల మానవ కణం బోల్తా పడుతుంది. ఫలితంగా వైరస్‌కు సంబంధించిన ఎంఆర్‌ఎన్‌ఏ.. పరాయిది కాదు, సొంతదేనని నమ్ముతుంది"
-యోగేశ్ గుప్తా, శాస్త్రవేత్త
ఎన్‌ఎస్‌పీ-10.. ఎన్‌ఎస్‌పీ-16 అనే మరో ఎంజైమ్‌తో కలిసి పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్‌ఎస్‌పీ-16కు సంబంధించిన త్రీడీ నిర్మాణాన్ని శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. దీనివల్ల.. వైరల్ ఎంఆర్‌ఎన్‌ఏలో మార్పులు చేయకుండా ఎన్‌ఎస్‌పీ-16ను నిలువరించేలా కొత్త ఔషధాల రూపకల్పనకు వీలు కలుగుతుందని వారు తెలిపారు. ఈ పరిశోధన ఆధారంగా ఎన్‌ఎస్‌పీ-10లో.. ఔషధాలు లక్ష్యంగా చేసుకోదగ్గ భాగాలనూ శాస్త్రవేత్తలు గుర్తించారు.