కరోనా మహమ్మారి విజృంభణకు తోడు.. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న క్రమంలో ఏది కరోనా, ఏది సాధారణ జబ్బు అనేది ఆందోళన కలిగించే విషయం. అయితే.. తాజాగా కరోనా లక్షణాల క్రమాన్ని గుర్తించారు శాస్త్రవేత్తులు. దీంతో రోగులు వెంటనే జాగ్రత్తలు తీసుకోవటం, స్వీయ నిర్బంధంలోకి వెళ్లటమే కాక వైద్యులు ఇతర వ్యాధిగ్రస్తులను వేరు చేసేందుకు ఉపయోగపడుతుందని చెబుతున్నారు.
దక్షిణ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ఈమేరకు జరిపిన తాజా అధ్యయనం సారాంశం ఫ్రాంటియర్స్ ఇన్ పబ్లిక్ హెల్త్ జర్నల్లో ప్రచురితమైంది.
కొవిడ్-19 బారిన పడిన రోగుల్లో లక్షణాల క్రమం తొలుత జర్వం.. ఆ తర్వాత దగ్గు, కండరాల నొప్పి, ఆపై వికారం లేదా వాంతులు, విరేచనాలు అవుతాయని గుర్తించారు శాస్త్రవేత్తలు.
"కొవిడ్-19 సంక్రమణతో సమానమైన ఫ్లూ వంటి అనారోగ్యాలకు గురైనప్పుడు ఈ క్రమాన్ని తెలుసుకోవటం చాలా ముఖ్యం. తాజా అధ్యయనంతో రోగుల సంరక్షణకు ఏ చర్యలు తీసుకోవాలో వైద్యులు నిర్ణయించగలుగుతారు. వారి పరిస్థితి మరింత దిగజారకుండా నిరోధించగలుగుతారు. కరోనా సోకిన రోగులను త్వరగా గుర్తించటం ద్వారా చికిత్స సమయం తగ్గుతుంది."
- పీటర్ కున్, యూఎస్సీలో ప్రొఫెసర్.
ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి ఫిబ్రవరి 16-24 మధ్య చైనాలో కరోనా బారిన పడిన 55వేల మందికిపైగా రోగుల సమాచారం సేకరించి వారిలోని లక్షణాలపై అధ్యయనం చేసి ఈ మేరకు నిర్ధరించారు శాస్త్రవేత్తలు. దీంతో పాటు 2019 డిసెంబర్ 11 నుంచి 2020 జనవరి 29 మధ్య సేకరించిన దాదాపు 1,100 కేసుల డేటాపైనా అధ్యయనం చేశారు.
ప్రారంభ లక్షణంగా అతిసారం కనిపిస్తే వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉంటుందని గుర్తించింది అధ్యయనం. తొలి దశలో అతిసారం లక్షణాలు కనిపించిన ప్రతి రోగికి చివరకు నిమోనియా లేదా శ్వాసకోశ ఇబ్బందులు వచ్చినట్లు తేల్చారు.
ఇదీ చూడండి: 'ఆ దేశ ప్రజలందరికీ ఉచితంగానే వ్యాక్సిన్'