Russia Ukraine India: రష్యా- ఉక్రెయిన్ సరిహద్దులో ఉద్రిక్తతలపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఈ ప్రాంతంలో శాంతికి భంగం కలిగిస్తాయని పేర్కొంది. ఉక్రెయిన్ అంశంపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నిర్వహించిన అత్యవసర సమావేశంలో మాట్లాడిన భారత శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి.. అన్ని పక్షాలు శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం ఇరుపక్షాలకు వీలైనంత త్వరగా చర్యలు ప్రారంభించాలని కోరారు.
Russia Ukraine UNSC meet
ఈ సందర్భంగా ఉక్రెయిన్లో భారతీయ పౌరుల భద్రతపై తిరుమూర్తి ఆందోళన వెలిబుచ్చారు. 20వేల మందికి పైగా భారతీయ విద్యార్థులు, పౌరులు ఉక్రెయిన్లోని వివిధ ప్రాంతాలలో నివసిస్తున్నారని, వారి సంక్షేమమే తమకు ప్రాధాన్యమని చెప్పారు.
"ఉక్రెయిన్- రష్యా ఫెడరేషన్ సరిహద్దుల వద్ద నెలకొన్న ఉద్రిక్తతలు ఆ ప్రాంతంలో శాంతి, భద్రతలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. అన్ని దేశాల ప్రయోజనాల దృష్ట్యా ఉద్రిక్తతలను తగ్గించడమే తక్షణ ప్రాధాన్యం. దౌత్యపరమైన చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించడం సాధ్యం."
-టీఎస్ తిరుమూర్తి, ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి
ట్రైలేటరల్ కాంటాక్ట్ గ్రూప్ ద్వారా ఉద్రిక్తతలను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్న దేశాల ప్రయత్నాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని తిరుమూర్తి పేర్కొన్నారు. సైనిక ఘర్షణలు మరింత తీవ్రం కాకుండా చూడాలని పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: