అమెరికాకు చెందిన ప్రముఖ రేడియో హోస్ట్ రష్ లింబా(70) కన్నుమూశారు. సంప్రదాయవాద(కన్సర్వేట్) కామెంటేటర్‌గా సుప్రసిద్ధులైన ఆయనకు ఏడాది క్రితం ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చింది. లింబా మరణాన్ని కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు.
అమెరికాలోని మితవాదుల గళాన్ని బలంగా వినిపించేవారు రష్ లింబా. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా రిపబ్లికన్ పార్టీలోని నేతల ఎదుగుదలను గణనీయంగా ప్రభావితం చేశారు. వ్యంగ్యస్త్రాలు సంధించడం, దూషణాపూర్వక వ్యాఖ్యానంలో తనకు ఎవరూ సాటి లేరని నిరూపించుకున్నారు. కామెంటేటర్‌గా తన 30ఏళ్ల కెరీర్లో 'బలమైన సంప్రదాయవాదం', 'తీవ్రమైన విభజనవాదం', 'స్వీయ ప్రచారా'నికి నిలువుటద్దంలా నిలిచారు.
దేవుడు నుంచి అప్పు!
లింబా తనను తాను ఎంటర్టైనర్గా చెప్పుకున్నప్పటికీ.. ఆయన పాల్గొనే రేడియో బ్రాడ్‌కాస్ట్‌లు అమెరికా సంప్రదాయవాద రాజకీయానికి మార్గదర్శనంగా నిలిచాయి. విషయమేదైనా తన అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్పేవారు లింబా. ఫాలోవర్లు సైతం ఆయన మాటలను అత్యంత పవిత్రంగా భావించేవారు. నిజాన్ని వెతికిపట్టుకునేవాడిగా తనను తాను అభివర్ణించుకునేవారు లింబా. 'ప్రజాస్వామ్య వైద్యుడు', 'మానవత్వ ప్రేమికుడు', 'చిన్నపాటి బ్లాక్‌హోల్'... ఇలా తనకు తాను పెట్టుకున్న పేర్లు ఎన్నో. తన ప్రతిభను దేవుడి నుంచి అప్పుగా తెచ్చుకున్నానని చెప్పుకునేవారు లింబా.
ట్రంప్ రాజకీయంగా ఎదగకముందు.. ఆయన ప్రత్యర్థులపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసేవారు లింబా. ప్రధాన మీడియా సంస్థలపై వ్యంగ్యంగా విమర్శలు గుప్పించేవారు. డెమొక్రాట్లు, వామపక్షవాదులను రాడికల్స్‌గా పరిగణించేవారు.
ఇదీ చదవండి: విల్లాయే జైలు.. యువరాణి బందీ!