అగ్రరాజ్య అధ్యక్షుడిని ఎన్నుకోవడంలో ముందస్తు పోలింగ్, ఎన్నికల రోజు నిర్వహించే పోలింగ్ రెండూ కీలకమే. ఈ సారి ఎన్నికల్లో కరోనా విజృంభణ నేపథ్యంలో బైడెన్ మద్దతుదారులు 'మెయిల్ ఇన్' ఓటింగ్‌కు మొగ్గుచూపారు. ట్రంప్ అనుకూలురు 'ఇన్ పర్సన్' బ్యాలెట్ ఓటింగ్‌కు జై కొట్టారు. ఈ క్రమంలో ఓట్ల లెక్కింపు సమయంలో ఆధిక్యాన్ని చూసి విజేతను నిర్ణయించలేమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఉదాహరణకు ఫ్లోరిడాలో పోలింగ్ ముగిసి.. ఓట్ల లెక్కింపు ముందస్తు ఓటింగ్‌తో ప్రారంభిస్తే.. జో బైడెన్ ముందంజలో ఉంటారు. అదే గంట తర్వాత పెన్సిల్వేనియాలో లెక్కింపు మొదలైతే.. అప్పుడు ట్రంప్ ఆధిక్యంలో ఉంటారు. ఇలాంటి ఫలితాలు చూసి వెంటనే ఓ నిర్ణయానికి రాలేము. మెయిల్ ఇన్/ అబ్సెంటీ ఓట్లను లెక్కించినప్పుడు ఫలితాలు ఒకలా.. బ్యాలెట్ ఓట్లను లెక్కించినప్పుడు మరోలా మారిపోతాయి.
'ఎలక్షన్ డే' ముందే మెయిల్ ఇన్ ఓట్లు లెక్కిస్తే.. ఆయా రాష్ట్రాల్లో బైడెన్ ఆధిక్యంలో ఉంటారు. అప్పుడు ఏ పోల్స్ చూసినా డెమొక్రాట్లే గెలుస్తున్నట్లు అనిపిస్తుంది. కానీ నవంబర్ 3 తర్వాత స్వింగ్ మొదలై ట్రంప్ ఆధిక్యంలో ఉంటారు. అప్పుడు రిపబ్లికన్లు జోష్ మీదుంటారు.
ఫ్లోరిడా, నార్త్ కరోలినా ప్రాంతాల్లో ఇప్పటికే మెయిల్ ఇన్ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఫలితాలు నవంబర్3 నాటికి వెల్లడికానున్నాయి. అప్పుడు బైడెన్ ఆధిక్యంలో ఉంటారు. ఎలక్షన్ డే రోజున ఓటింగ్ వేసేవాళ్లు ట్రంప్‌కు మద్దతిస్తున్నట్లు లెక్క. వీరందరి ఓటింగ్ వల్ల.. తొలుత డెమొక్రాట్లు ఆధిక్యంలో ఉన్నా చివరికి ఫలితాలు రిపబ్లికన్ల వైపే మెగ్గుచూపే అవకాశముంది.
టెక్సాస్, లోవా, ఒహియా ప్రాంతాల్లో 2016లో ట్రంప్ సునాయసంగా గెలిచారు. అయితే ట్రంప్ ఆధిపత్యానికి చెక్ పెడుతూ.. బైడెన్ నుంచి ఈ ఏడాది తీవ్ర పోటీ ఎదురైంది. ఈ ప్రాంతంలో తొలుత రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ ఆధిక్యంలో ఉన్నా.. మెయిల్ ద్వారా వేసిన ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి డెమొక్రాట్ అభ్యర్థి బైడెన్ రేసులోకి రావచ్చు.
సుప్రీంలో...
మిచిగాన్‌లో ఎలక్షన్ ముందురోజు నుంచే మెయిల్ ఇన్ బ్యాలెట్లను లెక్కిస్తున్నారు. ఎందుకంటే సాధారణ ఇన్ పర్సన్ బ్యాలెట్లతో పోలిస్తే.. మెయిల్ ఇన్ బ్యాలెట్ల లెక్కింపునకు కాస్త ఎక్కువ సమయం పడుతుంది. మెయిల్ ఇన్‌లో.. బ్యాలెట్ల సేకరణ, తరలింపు, లెక్కింపు సమయంలో సంతకం సరిపోల్చడం వంటి ప్రక్రియలు ఉంటాయి.
అదే పెన్సిల్వేనియా, విస్కాన్సిన్ ప్రాంతాల్లో ఎలక్షన్ డే వరకు మెయిల్ ఇన్ బ్యాలెట్లు లెక్కించరు. అందుకే ఇక్కడ ఓట్ల లెక్కింపునకు ఎక్కువ సమయం తీసుకోవచ్చు. ఎందుకంటే తొలిసారి ఈ ప్రాంతాల్లో భారీ స్థాయిలో మెయిల్ ఇన్ ఓటింగ్ నమోదైంది.
మిచిగాన్, ఫ్లోరిడాలో మెయిల్ ఇన్ వాడేవారి సంఖ్య అధికం. దాదాపు పావుశాతం మంది ఈ తరహా ఓటింగ్‌నే ఎంచుకుంటారు.
పెన్సిల్వేనియాలో కౌంటింగ్ గడువు పెంచాలని డెమొక్రాట్లు ఇటీవలే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఫలితంగా ఎలక్షన్ డే తర్వాత మూడు రోజుల వరకు మెయిల్ ఇన్ బ్యాలెట్లను స్వీకరించవచ్చని న్యాయస్థానం ఆదేశించింది. అయితే విస్కాన్సిన్, మిచిగాన్‌లో మాత్రం నవంబర్ 3 తర్వాత ఆలస్యంగా వచ్చే బ్యాలెట్లను లెక్కించకపోవచ్చు. అయితే వీటిపై ఇంకా కోర్టులో వ్యాజ్యం నడుస్తోంది.
ఫలితాలపై ప్రభావం ఇలా..
2018లో 'ఎన్నికల రోజు' మాట్లాడిన ఆరిజోనా రిపబ్లికన్ అభ్యర్థి మార్తా మెక్‌సల్లీ.. తను యూఎస్ సెనేట్ రేసులో దాదాపు 14 వేల ఓట్లతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. అయితే ఎన్నికలు జరిగిన ఆరు రోజుల వరకు మెయిల్ ఇన్ బ్యాలెట్లను సేకరించడం వల్ల.. చివరికి ఆ ప్రాంతంలోని డెమొక్రటిక్ అభ్యర్థి కిర్‌స్టన్ సినేమా గెలుపొందారు. అందుకే మెయిల్ ఇన్‌కు గడువు పెంచితే.. అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో మార్పులు రావచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల రోజు తర్వాత వచ్చే 'మెయిల్ ఇన్' బ్యాలెట్లను స్వీకరణకు అనుమతి ఇవ్వొద్దని ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు.
బైడెన్ వర్గం మాత్రం మరోలా వాదిస్తోంది. పోస్టల్ విభాగం ట్రంప్‌కు మద్దతుగా ఉందని.. ఎలక్షన్ డే నాటికి అధికారులు మెయిల్ ఇన్ బ్యాలెట్లను చేర్చడంలో విఫలమైతే ఫలితాలు మారతాయని అంటున్నారు. అందుకే ఎన్నికలు జరిగిన అనంతరం వారం రోజుల వరకు మెయిల్ ఇన్ స్వీకరణకు గడువు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాలు కోర్టులను ఆశ్రయిస్తున్నాయి. ఈ కారణాల వల్ల ఈ ఏడాది అధ్యక్ష ఎన్నికల ఫలితాలు కాస్త ఆలస్యంగా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. లెక్కింపు కూడా ఒక్కో ప్రాంతంలో ఒక్కో సమయంలో జరగడం వల్ల.. ఫలితాలను అంచనా వేయడం కాస్త కష్టమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇదీ చూడండి: