బిన్ లాడెన్ కొడుకు, అల్‌ఖైదా వారసత్వ అధినేత హమ్జా బిన్ లాడెన్ మరణించినట్లు అమెరికా మీడియా సంస్థలు తెలిపాయి. ఇదే విషయాన్ని అగ్రరాజ్యానికి చెందిన కొందరు అధికారులు ధ్రువీకరించినట్టు ఎన్బీసీ న్యూస్ పేర్కొంది. అయితే హమ్జా మరణానికి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడించడానికి అధికారులు నిరాకరించారు. ఈ విషయంపై స్పందించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిరాకరించారు.
అగ్రరాజ్య ప్రమేయమున్న ఆపరేషన్‌లో భాగంగా గత రెండేళ్లలో ఏదో ఒక సమయంలో హమ్జా మరణించాడని అధికారులు తెలిపినట్టు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.
హమ్జాపై ట్రంప్ సర్కారు ఈ ఫిబ్రవరిలో మిలియన్ డాలర్ల నజరానా ప్రకటించింది. అంతకుముందే హమ్జా లాడెన్ మరణించి ఉండొచ్చని అధికారుల సమాచారం ప్రకారం తెలుస్తోంది.
2011 మేలో పాకిస్థాన్‌లో అమెరికా బలగాలు ఒసామా బిన్‌లాడెన్‌ను హతమార్చాయి. లాడెన్‌కు 20 మంది కుమారులు. వారిలో హమ్జా లాడెన్ 15వ వాడు. తన తండ్రి హత్యకు ప్రతీకారంగా ప్రపంచవ్యాప్తంగా అలజడులు సృష్టించాలని ఉగ్రవాదులకు పిలుపునిచ్చాడు హమ్జా.
ఇదీ చూడండి: బాలిస్టిక్ క్షిపణులతో అమెరికాకు కిమ్ హెచ్చరిక