అమెరికాలో పోలీసు దుశ్చర్యతో ప్రాణాలు కోల్పోయిన నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్ మృతికి నిరసనగా పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన బాట పట్టారు. న్యూయార్క్‌లోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్ వద్ద భారీ సంఖ్యలో చేరుకొని నిరసన వ్యక్తం చేశారు ప్రజలు. న్యూయార్క్‌లో రాత్రి 11 గంటలకు కర్ఫ్యూ ప్రారంభం కాగా.. సాయంత్రం వరకు భారీగా జనం చేరుకొని నిరసన తెలిపారు.
గత వందేళ్లలో శ్వేతజాతీయుల చేతిలో బలైన నల్లజాతీయులను స్మరించుకుంటూ చికాగోలో ఆందోళన నిర్వహించారు నిరసనకారులు. జార్జి ఫ్లాయిడ్ మృతికి సంతాపం తెలుపుతూ.. పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పారిస్‌లోనూ..
జార్జి ఫ్లాయిడ్ మృతికి నిరసనగా పలువురు ఆందోళనకారులు పారిస్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ఎదుట శాంతియుత ప్రదర్శన చేపట్టారు. మోకాళ్లపై నిల్చొని సంఘీభావం ప్రకటించారు.
శవపరీక్ష ఫలితాలు
జార్జి ఫ్లాయిడ్ మృతికి గల కారణాలపై జరిపిన స్వతంత శవపరీక్ష దర్యాప్తు వివరాలను బాధితుడి కుటుంబ సభ్యులు వెల్లడించారు. మెడపై ఒత్తిడి పడటం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడ్డాయని... అనంతరం మెదడుకు రక్త సరఫరా నిలిచిపోయి ఊపిరాడక ఫ్లాయిడ్ మరణించినట్లు స్పష్టం చేశారు.
అయితే అధికారిక శవపరీక్ష ఫలితాలతో పోలిస్తే ఈ ఫలితాలు వేరుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదివరకు ఉన్న ఆరోగ్య సమస్యలతో పాటు మత్తు పదార్థాలు తీసుకోవడం వల్లే ఫ్లాయిడ్ మరణించి ఉండొచ్చని అధికారిక శవపరీక్షల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.
మారని తీరు!
మరోవైపు లాడర్డేల్లో ఓ పోలీసు అతిగా ప్రవర్తించాడు. నిరసనల్లో పాల్గొన్న ఓ మహిళను నెట్టివేస్తు కెమెరాకు చిక్కాడు. మోకాలి మీద నిల్చొని ఉన్న మహిళను పక్కకు తోసేస్తున్న వీడియో వైరల్ కావడం వల్ల సదరు పోలీసును.. అధికారులు సస్పెండ్ చేశారు.
ఇదీ చదవండి: ఆఫ్రికాలో మళ్లీ ఎబోలా కలకలం-నలుగురు మృతి