చైనా పట్ల తమ విధానాలను మార్చుకోవాలని అమెరికా విదేశాగమంత్రి మైక్ పాంపియో అభిప్రాయపడ్డారు. రాజకీయంగా చైనాతో మరింత స్వేచ్ఛ లభిస్తుందనే నమ్మకంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ విస్తరణకు కృషి చేశామని, కానీ ఎలాంటి ఫలితం దక్కలేదన్నారు. ఈ నేపథ్యంలో ఇతర మార్గాలను ఎంచుకోక తప్పదని వెల్లడించారు పాంపియో.
"చైనా ఆర్థిక వ్యవస్థ విస్తరణకు సహాయం చేస్తే.. రాజకీయ స్వేచ్ఛ, ఆ దేశ ప్రజలకు ప్రాథమిక హక్కులు కలుగుతాయని భావించాం. కానీ అలా జరగలేదు. ఇది పని చేయలేదు. ముందున్న ప్రభుత్వాలను నేను తప్పుబట్టడం లేదు. కానీ ఇది పని చేయలేదని స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికా వేరే మార్గాన్ని ఎంచుకోవాలనేది దాని అర్థం."
--- మైక్ పాంపియో, అమెరికా విదేశాంగ మంత్రి.
చైనా తీరుతో అమెరికా ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని.. ఈ విషయం అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రహించారని పేర్కొన్నారు పాంపియో.
"చైనా తీరుపై అసహనం వ్యక్తం చేసిన తొలి అధ్యక్షుడు ట్రంప్. డెమొక్రాట్ అధ్యక్షులు.. చైనాతో కుదుర్చుకున్న సంబంధాల వల్ల అమెరికాలోని మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగాలు చేస్తున్న వారిపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. చైనాతో సంబంధం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకే అధిక నష్టం కలిగింది."
--- మైక్ పాంపియో, అమెరికా విదేశాంగమంత్రి.
చైనా ప్రజలు విజయవంతం కావాలని, మెరుగైన జీవితాలు పొందాలని, అమెరికాతో సత్సంబంధాలు ఏర్పరుచుకోవాలని తాము కోరుకున్నట్టు తెలిపారు పాంపియో. కానీ వారు ఏ మాత్రం మారలేదని ఆరోపించారు. హాంకాంగ్‌లో ప్రవేశపెట్టిన జాతీయ భద్రతా చట్టం నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు అమెరికా విదేశాంగమంత్రి.