ప్రపంచ మహిళానిధికి అమెరికా నిధులు మరికొద్ది రోజుల్లో 2020 సంవత్సరానికి గాను అమెరికా బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు ఆ దేశాధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్. ఈ బడ్జెట్లో తన కూతురు ఇవాంక ట్రంప్ ఆధ్వర్యంలో ఉన్న 'ప్రపంచ మహిళా నిధి'కి 100 మిలియన్ డాలర్లు అందించనున్నారు. ఈ నిధులను ప్రపంచ వ్యాప్తంగా మహిళల అభివృద్ధి, శ్రేయస్సుకోసం ఖర్చు చేయనున్నారు. ఉద్యోగ శిక్షణ, ఆర్థిక సహకారం తదితర అంశాల్లో వీరికి సహకారం అందించడానికే ఈ నిధులని స్పష్టం చేశారు.
ఇవాంక ట్రంప్ 2017లో ట్రంప్ పరిపాలనా విభాగంలో చేరినప్పటి నుంచి ప్రధానంగా మహిళల ఆర్థిక సమస్యలపైనే దృష్టి సారించారు.
సోమవారం బడ్జెట్ ?
ట్రంప్ '2020 బడ్జెట్'ను సోమవారం ప్రవేశపెట్టే అవకాశముందని శ్వేతసౌధం అధికారులు తెలిపారు. బడ్జెట్ గురించి మరిన్ని వివరాలు వెల్లడించేందుకు అధికారులు విముఖత వ్యక్తం చేశారు.