అమెరికాలోని క్యాపిటల్ భవనం వద్ద నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణిగాయి. కాంగ్రెస్ లైబ్రరీ వద్ద ఓ ట్రక్కును నిలిపిన దుండగుడు.. అందులో బాంబు ఉందని పోలీసులకు తెలిపాడు. దాదాపు ఐదు గంటలకుపైగా నిందితుడితో చర్చలు జరిపారు పోలీసులు. ఆ తర్వాత అతడు లొంగిపోయాడు.
ఏం జరిగిందంటే..?
ఫ్లాయిడ్ రే రోస్బెర్రీ(49) అనే వ్యక్తి.. నెంబర్ప్లేట్లేని ఓ ట్రక్కును క్యాపిటల్ భవనం దగ్గర ఉన్న కాంగ్రెస్ లైబ్రరీ వద్ద నిలిపాడు. అక్కడున్న ఓ అధికారికి ట్రక్కులో బాంబు ఉందని తెలిపాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. పరిసర ప్రాంతాల్లోని ప్రజలను ఖాళీ చేయించారు. రోస్బెర్రీతో దాదాపు ఐదు గంటలపాటు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఆ తర్వాత నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు. అంతకుముందు రోస్బెర్రీ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాడని, డెమోక్రాట్లు పదవినుంచి దిగిపోవాలన్నాడని పోలీసులు తెలిపారు. అయితే తనకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అంటే ఇష్టమన్నాడన్నారు.
బాంబు ఉన్నట్లు భావించిన ట్రక్కులో పేలుడు పదార్థాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రంగంలోకి దిగిన అధికారులు దర్యాప్తు చేపట్టారు.
ఘటన నేపథ్యంలో పరిసర ప్రాంతాలను ఖాళీ చేయించి పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: అఫ్గాన్‌లో స్వేచ్ఛకు సంకెళ్లు.. మహిళల మెడపై 'షరియా' కత్తి