భారత్-భూటాన్ ద్వైపాక్షిక సంబంధాల సమీక్షే ప్రధాన ధ్యేయంగా ఇరుదేశాల ప్రధానులు నరేంద్రమోదీ, లోటే థెరింగ్ అమెరికాలో సమావేశమయ్యారు. జలవిద్యుత్, అంతరిక్షం, డిజిటల్ కనెక్టివిటీ, ఆర్థిక, తృతీయ విద్యారంగాల్లో ఇరుదేశాలు ఉమ్మడిగా చేపడుతున్న కార్యక్రమాలను సమీక్షించారు.
74వ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ పలుదేశాల నేతలతో సమావేశమయ్యారు. ఈ వారం జరిగిన వాతావరణ కార్యాచరణ సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ 'విపత్తు స్థితిస్థాపక మౌలిక సదుపాయాలు' (సీజీఆర్ఐ) ప్రతిపాదించారు. అందులో వ్యవస్థాపక సభ్య దేశంగా చేరాలని భూటాన్‌ను కోరారు.
ఉగ్రవాదాన్ని సహించం..
ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతోనూ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఉగ్రవాదాన్ని సహించేంది లేదని ఇరువురు నేతలు స్పష్టం చేశారు. బలమైన భద్రతా భాగస్వామ్యం ఇరుదేశాల మధ్య పరస్పర విశ్వాసాన్ని పెంచుతుందని అభిప్రాయపడ్డారు.
ఇరుదేశాల మధ్య ఉన్న భూ, నదీ, సముద్ర, వాయు అనుసంధానం గురించి, విద్యుత్ భాగస్వామ్యం, వాణిజ్యం, ఆర్థిక సంబంధాల పురోభివృద్ధిపై చర్చించారు. ఇవి పొరుగు దేశాల పురోగతి, స్థిరత్వానికి తోడ్పడతాయని అభిప్రాయపడ్డారు.
మహాత్మా గాంధీ 150 జయంతి ఉత్సవాలకు హాజరుకానున్న హసీనాకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు.
మోదీ బంగ్లాదేశ్ రండి..
బంగబంధు, తన తండ్రి అయిన షేక్ ముజుబూర్ రెహ్మాన్ 100వ జన్మదిన వేడుకలకు హాజరవ్వాల్సిందిగా ప్రధాని మోదీని షేక్ హసీనా ఆహ్వానించారు. మోదీ ఈ ఆహ్వానాన్ని అంగీకరించారు.
ఇదీ చూడండి: 'కార్టూనిస్టులకు పని కల్పిస్తోన్న ఇమ్రాన్‌ఖాన్'