అమెరికా అలస్కా ఎయిర్లైన్స్ విమానంలో ఓ ప్రయాణికుడి స్మార్ట్ఫోన్లో మంటలు చెలరేగాయి. దీంతో ఆ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు అధికారులు. అందులో ఉన్న ప్రయాణికులు సహా సిబ్బందిని ఖాళీ చేయించి.. బస్సులో సురక్షితంగా తరలించారు. అదృష్టవశాత్తూ కొందరికి స్వల్ప గాయాలు మినహా.. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని స్థానిక మీడియా పేర్కొంది.
ఇదీ జరిగింది
అలస్కా751 విమానం.. 128 మంది ప్రయాణికులతో న్యూ ఓర్లీన్స్ నుంచి సీటెల్‌కు ప్రయాణిస్తోంది. ఈ క్రమంలో ఓ ప్రయాణికుడి స్మార్ట్ఫోన్లో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన సిబ్బంది.. మంటలు అదుపు చేసి, సీటెల్-టాకోమా అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ప్రయాణికులతో పాటు సిబ్బందిని సురక్షితంగా బస్సులో తరలించారు.
అనంతరం ఘటనపై దర్యాప్తు జరిపిన సిబ్బంది.. ఆ స్మార్ట్ఫోన్ పూర్తిగా దగ్ధమైనట్లు గుర్తించారు. అయితే ఏ మోడల్ ఫోన్ అని కచ్చితంగా చెప్పలేమని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: Donald Trump: 'ఎంతమంది ఉగ్రవాదులను బైడెన్ తీసుకొస్తారో'