ఎడతెరపి లేకుండా కురుస్తున్న మంచు.. వివిధ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అనేక చోట్ల హిమపాతంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మైనస్ ఉష్ణోగ్రతలతో చలికి గజగజ వణుకుతున్నారు. రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది.
టెక్సాస్‌లో గజగజ..
ఆదివారం నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు అమెరికాలోని టెక్సాస్, లూసియానాలో హిమపాతం కొనసాగింది. టెక్సాస్‌లోని దక్షిణ ప్రాంతాల్లో 6 అంగుళాల మేర మంచు కురిసినట్లు హూస్టన్‌లోని జాతీయ వాతావరణ సేవల విభాగం తెలిపింది. అత్యవసరమైతే తప్ప రోడ్ల మీదకు రావొద్దని స్థానికులను అక్కడి అధికారులు కోరుతున్నారు.
ఇటలీపై మంచు ప్రతాపం!
ఇటలీలోని పెరుజియా, ప్రాటో కార్నికోల్లో మంచు భారీగా కురుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలను చేపట్టారు. భవనాలపై పేరుకుపోయిన మంచును తొలగిస్తున్నారు.
జపాన్‌లో వణకు..
జపాన్‌లోని సముద్ర తీర ప్రాంతాలను సోమవారం మంచు ముంచెత్తింది. భారీ హిమపాతం వల్ల మధ్య జపాన్‌లోని ఫుకుయ్లో 100 కి పైగా వాహనాలు హైవేలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది.
మంచు వల్ల రవాణాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పలు చోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడింది. సహాయక చర్యల్లో భద్రతా బలగాలు నిమగ్నమయ్యాయి. మరికొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే మూడు రెట్లు అధికంగా మంచు కురిసే అవకాశం ఉందని అక్కడి అధికారులు హెచ్చరించారు.
ఇదీ చూడండి:రష్యాలో ఆహ్లాదకరంగా "స్నోమెన్" ఫెస్టివల్