సీనియర్ డెమొక్రటిక్ నేత నాన్సీ పెలోసీ అమెరికా ప్రతినిధుల సభకు స్పీకర్‌గా మరోసారి ఎన్నికయ్యారు. రిపబ్లికన్ నేత కెవిన్ మెకార్తీపై 216-209 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఫలితంగా ఎనభయ్యేళ్ల పెలోసీ నాలుగోసారి ప్రతినిధుల సభకు స్పీకర్‌గా వ్యవహరించనున్నారు.
మొత్తం 427 ఓట్లు పోలవగా.. సెనెటర్ టామీ డక్‌వర్త్, హకీమ్ జెఫ్రీస్‌కు తలో ఓటు దక్కింది. సభలో డెమొక్రటిక్ పార్టీకి 222 మంది సభ్యుల బలం ఉంది. అయితే ఆరుగురు డెమొక్రాట్లు పెలోసీకి ఓటు వేయలేదని తెలుస్తోంది. రిపబ్లికన్ నేత మెకార్తీకి మాత్రం ఆ పార్టీ ఓట్లన్నీ పడ్డాయి.
స్పీకర్‌గా ఎన్నికవ్వడం పట్ల పెలోసీ సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ఇతర సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు.
"117వ కాంగ్రెస్ సభకు స్పీకర్‌గా వ్యవహరించేందుకు నన్ను నామినేట్ చేయడం గౌరవంగా భావిస్తున్నాను. దేశ చరిత్రలో వైవిధ్యమైన సభ్యులు ఉన్న ప్రతినిధుల సభకు స్పీకర్‌గా సేవలందించడం నాకు గర్వకారణం. సంక్షోభంలోనూ ప్రజల కోసం మేం చేసే పని కొనసాగుతుంది. ఇదివరకు ఏ నాయకత్వం ఎదుర్కోని సమస్యను పరిష్కరించే బాధ్యతను మనం స్వీకరిస్తున్నాం. కరోనా వైరస్‌ను ఓడించడమే మన తొలి ప్రాధాన్యం."
-నాన్సీ పెలోసీ, అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్
హౌస్ డెమొక్రాట్‌కు 17 ఏళ్లు ఇంఛార్జిగా వ్యవహరించారు పెలోసీ. ప్రతినిధుల సభకు తొలి మహిళా స్పీకర్‌గా ఎన్నికయ్యారు. 2006-2011 వరకు ఆ స్థానంలో సేవలందించారు. 2011 తర్వాత సభలో మైనారిటీ లీడర్‌గా ఉన్నారు. 2018లో మరోసారి స్పీకర్‌గా ఎన్నికయ్యారు.
కమలాభినందన
స్పీకర్‌గా ఎన్నికైన పెలోసీకి అమెరికా తదుపరి ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ శుభాకాంక్షలు తెలిపారు. అమెరికా ప్రజల తరపున పెలోసీతో కలిసి పనిచేసేందుకు, తర్వాతి తరాలకు మంచి భవిష్యత్తును అందించేందుకు ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
మహాత్మా గాంధీ సిద్ధాంతాలను పాటించే పెలోసీ.. మానవహక్కుల సమస్యలపై తన గళం వినిపిస్తూ ఉంటారు. భారత్-అమెరికా సంబంధాలు బలోపేతం కావాలని కోరుకునే నేతల్లో పెలోసీ ఒకరు.
సెనేట్ ఎవరిదో?
కరోనా వైరస్ ఉద్ధృతి మధ్యే అమెరికా కాంగ్రెస్ సమావేశాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. నవంబర్ ఎన్నికల్లో సభకు ఎన్నికైన ప్రతినిధులు ప్రమాణస్వీకారం చేశారు. పెలోసీ ఎన్నికతో ప్రతినిధుల సభ.. డెమొక్రాట్లు హస్తగతం చేసుకోగా.. సెనేట్ పీఠంపై అనిశ్చితి నెలకొంది. జార్జియా సెనేట్ స్థానాలకు జరిగే ఎన్నికల ఫలితాలు ఈ సభలో ఆధిక్యాన్ని నిర్ణయిస్తాయి.
ఇవీ చదవండి:
'నాకు ఆ ఓట్లు కావాలి'- జార్జియా అధికారితో ట్రంప్