వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లికి డేట్ కూడా ఫిక్స్ చేశారు. అయితే ప్రేయసిపై తనకున్న ఇష్టాన్ని ప్రపోజ్ చేసి చెప్పాలని అనుకున్నాడు. అందరు ప్రేమికులు చేసేది ఇదే కదా! ఇందులో వింత ఏముంది అని అనుకుంటున్నారా? అవును ఇది నిజంగా వింతే!
సంకల్పం ఉంటే ఏ పనైనా చేయొచ్చని అంటారు. దానికి ప్రేమ తోడైతే దానికి తిరుగుండదు. పైన చెప్పిన స్టోరీలో ఇలానే జరిగింది. కనీసం కదల్లేని స్థితిలో ఉన్న ఓ వ్యక్తి, ఓ పరికరం సహాయంతో మోకాలిపై వంగి ఆమెకు తన ప్రేమను వ్యక్తపరిచాడు. తెగ సంతోషపడిన ప్రేయసి.. అతడిపై ముద్దుల వర్షం కురిపించింది.
అనుకోని ప్రమాదం..
అమెరికా వర్జీనియాలో నివసిస్తున్న జోస్ స్మిత్.. 2014లో స్నేహితులతో కలిసి బీచ్‌కు వెళ్లాడు. అక్కడ అనుకోని ప్రమాదం అతన్ని కుర్చీకే పరిమితం చేసింది. డైవింగ్ చేస్తుండగా.. ఇసుకతిన్నెలకు తగులుకుని స్మిత్‌కు బలమైన గాయాలు అయ్యాయి. దీని కారణంగా శరీరంలో ఛాతీ కింద భాగం పారలైజ్ అయింది. రోజూవారి దినచర్యలేవి చేయలేని దుస్థితి అతడికి ఏర్పడింది.
కదిలించిన ప్రేమ..
స్మిత్, గ్రేస్ అనే యువతిని గత ఏడాది ఫిబ్రవరిలో కలిశాడు. వారి పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరు ఒక్కటవ్వాలనుకున్నారు. ఈ అక్టోబర్‌లో వివాహానికి ముహూర్తం ఖరారు చేసుకున్నారు. అయితే వెడ్డింగ్ ప్రపోజల్ అనుభూతిని తన ప్రేయసికి కలిగించాలని స్మిత్ భావించాడు. అందుకు తన అచేతనత్వం అడ్డొచ్చినా.. ఆమెపై ఉన్న ప్రేమ తనను కదిలించింది. హెక్సోస్కెలిటన్ రూపంలో దారి చూపించింది. ఆ వస్తువును ఉపయోగించి సాధారణ వ్యక్తులలాగే మోకాలిపై వంగి, ప్రపోజ్ చేసి తన ప్రేయసిని ఆశ్చర్యపరిచాడు. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన ఈ వీడియో నెటిజన్ల మనసు కదిలిస్తోంది.
"సంప్రదాయంగా ప్రపోజ్ చేయాలనే ఆలోచన వచ్చింది. కానీ అది సాధ్యం అవుతుందో లేదో నాకు తెలియదు. ఇంతకుముందు నాలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్లు ఎవరూ ఇలా చేయడం చూడలేదు. వైద్యులను సంప్రదించి విషయం వివరించాను. వారు నాకు సహకరించారు. హెక్సోస్కెలిటన్ సహాయంతో నేను అనుకున్న దానిని సాధ్యం చేశారు" అని జోష్ స్మిత్ చెప్పాడు.
ఇదీ చదవండి:డెస్టినేషన్ వెడ్డింగ్ నుంచి కాక్టైల్ పార్టీ వరకు...