అది లండన్‌లో అత్యంత ఖరీదైన మ్యాడక్స్ వీధిలోని వాణిజ్య భవంతి. అందులోని దుకాణాలు, కార్పొరేట్ కార్యాలయాల నిర్వాహకులకు తమ భవనం వేరే యాజమాన్యం చేతుల్లోకి వెళ్లిందని పుష్కర కాలం క్రితం తెలిసింది. ఆ భవనం కొత్త యజమాని 11 ఏళ్ల హైదర్ అలియేవ్ అని, అతను అజర్‌బైజాన్ దేశాధ్యక్షుడు ఇల్హమ్ అలియేవ్ కుమారుడని అప్పట్లో వారి దృష్టికి రాలేదు. పాండోరా పత్రాలతో ఆ బండారం బట్టబయలైంది. అజర్‌బైజాన్ అధ్యక్షుడు తన కుమారుడి తరఫున 4.89 కోట్ల డాలర్లు (సుమారు రూ.366 కోట్లు) వెచ్చించి మ్యాడక్స్ వీధిలోని భవనాన్ని సొంతం చేసుకున్నా- కాగితాలపై కొనుగోలుదారు పేరు మాల్నిక్ హోల్డింగ్స్‌గా నమోదైంది. కరీబియన్ సముద్రంలో బ్రిటన్ అధీనంలో ఉన్న ద్వీప దేశం వర్జిన్ ఐలాండ్స్‌లో మాల్నిక్ కంపెనీ రిజిస్టరైంది. బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ చట్టాల చలవతో ఈ వ్యవహారం ఇంతకాలం గోప్యంగా ఉండిపోయింది. అంతర్జాతీయ పరిశోధనాత్మక పాత్రికేయుల కూటమి (ఐసీఐజే) సభ్యులైన 600 మంది జర్నలిస్టులు రెండేళ్ల నుంచి 1.2 కోట్ల దస్త్రాలను జల్లెడ పట్టి నిగ్గుతేల్చిన నిగూఢ వాస్తవాలు నేడు పాండోరా పత్రాలుగా (Pandora Papers Leak) సంచలనం సృష్టిస్తున్నాయి.
వేలల్లో డొల్ల కంపెనీలు, ట్రస్టులు
ప్రజల కళ్లుగప్పి వేల కోట్ల డాలర్ల నిధులను విదేశాల్లోని బ్యాంకు ఖాతాలకు అక్రమంగా తరలించిన ప్రబుద్ధుల్లో దేశాధ్యక్షులు, ప్రధానమంత్రులు, రాజకీయ నాయకులు, బడా వ్యాపారులు, సంఘ ప్రముఖులు, మత నాయకులు కూడా ఉండటం ప్రపంచాన్ని నివ్వెరపరుస్తోంది. అపర కుబేరులు, నాయకులు స్వదేశంలో అధిక పన్నుల బారి నుంచి తప్పించుకుని అవినీతి సొమ్మును దాచుకోవడానికి పనామా, దుబాయ్, మొనాకో, స్విట్జర్లాండ్, కేమన్ ఐలాండ్స్ వంటివి అవకాశమిస్తున్నాయి. వారి తరఫున డొల్ల కంపెనీలు, గోల్‌మాల్ ఖాతాలను తెరిచి అక్రమ ధనాన్ని తరలించడానికి 14 సంస్థలు తోడ్పడుతున్నాయి. మొత్తం 35 మంది ప్రస్తుత, మాజీ దేశాధినేతలు, 91 దేశాలకు చెందిన 300 మంది మంత్రులు, ఉన్నతాధికారులు, న్యాయమూర్తులు, సైన్యాధికారులు, మేయర్లు, 100 మంది శతకోటీశ్వరులు రహస్య ఖాతాల్లో డబ్బు దాచుకున్నట్లు పాండోరా పత్రాలు వెల్లడించాయి. వీరు తమ గుప్త ధనంతో సంపన్న దేశాల్లో స్థిరాస్తులు, విహార నౌకలు తదితరాలను సమకూర్చుకున్నారు. కొందరు ప్రబుద్ధులు పికాసో వంటి జగద్విఖ్యాత చిత్రకారుల చిత్రపటాలు, కంబోడియా నుంచి చోరీ అయిన ప్రాచీన కళాఖండాలను సైతం విదేశీ బ్యాంకుల్లో దాచిపెట్టారు.
పెద్ద సంఖ్యలో భారతీయులు
పాండోరా పత్రాలలో దాదాపు 380 మంది భారతీయుల పేర్లూ ఉన్నాయి. బ్రిటిష్ కోర్టులో ఈ ఏడాది దివాలా పిటిషన్ దాఖలు చేసిన అనిల్ అంబానీ శతకోటీశ్వరులని పాండోరా పత్రాలు వెల్లడించాయి. పన్ను ఆశ్రయమిచ్చే దేశాల్లో అనిల్ 18 డొల్ల కంపెనీలను నెలకొల్పారు. వాటిలో ఏడు దాదాపు 130 కోట్ల డాలర్ల రుణాలు తీసుకుని పెట్టుబడులు పెట్టాయి. అపర కుబేరుడు గౌతమ్ అదానీ సోదరుడు వినోద్, బయోకాన్ అధినేత కిరణ్ మజుందార్ షా భర్త జాన్ షా, కార్పొరేట్ పైరవీకారిణి నీరా రాడియా, బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్, సైనిక నిఘా సంస్థ మాజీ డైరెక్టర్ జనరల్ రాకేశ్ కుమార్ లూంబా, సోనియా గాంధీ కుటుంబ విధేయుడు దివంగత కెప్టెన్ సతీశ్ శర్మ, క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్, ఆయన సతీమణి అంజలి పేర్లు కూడా పాండోరా పత్రాలలో ఉన్నాయి. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరుపుతామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
పనామా దేశానికి చెందిన మొసాక్ ఫోన్సెకా అనే కార్పొరేట్, న్యాయ సేవల సంస దేశదేశాల్లో నెలకొల్పిన వేలాది డొల్ల కంపెనీల బాగోతాన్ని 2016లో ఐసీఐజే బట్టబయలు చేసింది. ఇది పలువురు ప్రముఖులపై కేసుల నమోదుకు దారితీసింది. 136 కోట్ల డాలర్ల అక్రమ ధనాన్ని అధికారులు స్వాధీనం చేసుకునేలా చేసింది. 2017లో మరో మూడు సంస్థలకు చెందిన రహస్య పత్రాలూ బయటపడ్డాయి. అవి ప్యారడైజ్ పత్రాలుగా వార్తలకెక్కాయి. తాజాగా 14 సంస్థల నుంచి లీకైన 1.2 కోట్ల రహస్య ఖాతా పత్రాలను పాండోరా పత్రాలుగా వ్యవహరిస్తున్నారు. సంపన్నుల అక్రమ ధనాన్ని తమ బ్యాంకుల్లో దాచుకోవడానికి అనుమతిస్తున్న దేశాలు కొన్ని ఉన్నాయి. ఇందుకు అవి అతి తక్కువ పన్ను వసూలు చేస్తున్నాయి. విదేశీ వ్యక్తులు, సంస్థల వివరాలను గోప్యంగా ఉంచే చట్టాలనూ చేశాయి. దేశదేశాల్లోని రాజకీయ నాయకులు, కార్పొరేట్ అధిపతుల అక్రమ ధనాన్ని ఈ రహస్య ఖాతాల్లోకి మళ్ళించడానికి తోడ్పడే సంస్థల తీగ లాగితే డొంకంతా కదిలింది. అవినీతి సొమ్ము తరలింపునకు ఈ సంస్థలు 29,000 డొల్ల కంపెనీలను, ట్రస్టులను ఏర్పాటు చేసినట్లు పాండోరా పత్రాలు బయటపెట్టాయి.
ఆదాయానికి గండి
కొవిడ్ ఉద్ధృతికి పేద దేశాల ఆర్థిక వ్యవస్థలు అల్లకల్లోలం కావడంతో పాటు లక్షల మంది మరణించిన తరుణంలో పాండోరా పత్రాలు సంపన్నులు, నాయక గణాల స్వార్థబుద్ధిని, కుత్సితాన్ని వెలికితెచ్చాయి. కొవిడ్ దెబ్బకు పేద, మధ్యతరగతి ప్రజలు ఉపాధిని, వ్యాపారాలను కోల్పోయారు. ధనవంతులు మాత్రం తమ నష్టాలను కేవలం తొమ్మిది నెలల్లోనే పూడ్చుకొని, కొవిడ్ ముందుకన్నా ఎక్కువ సంపదను మూటగట్టుకుంటున్నారు. ఒక్క భారత్‌లోనే గతేడాది కోటీశ్వరుల సంపద 35శాతం పెరిగింది. వీరు తమ సంపదను విదేశాల్లో దాచుకోవడం వల్ల భారత ప్రభుత్వం భారీగా పన్నుల ఆదాయం కోల్పోతోంది. ప్రపంచ దేశాలన్నీ కలిపి ఏటా 42,700 కోట్ల డాలర్ల పన్ను ఆదాయం నష్టపోతున్నాయి. అందులో పేద దేశాలు కోల్పోతున్నది ఏటా 20,000 కోట్ల డాలర్లు. ఇది ఆయా దేశాలకు అందే అంతర్జాతీయ ఆర్థిక సహాయంకన్నా చాలా ఎక్కువ. ఒకవైపు ఆదాయం తరిగిపోతుంటే, మరోవైపు కొవిడ్ కట్టడికి ప్రభుత్వాలు వేల కోట్లు వెచ్చించాల్సి వస్తోంది. దీనివల్ల వర్ధమాన దేశాల్లో మౌలిక వసతుల కల్పనకు, పారిశ్రామికాభివృద్ధికి నిధులు చాలక ఆర్థికాభివృద్ధి కుంటువడుతోంది. వర్ధమాన దేశాల్లో ఆర్థిక అంతరాలు పెరుగుతుంటే, సంపన్న దేశాల్లో విదేశీ కుబేరుల కొనుగోళ్ల వల్ల స్థిరాస్తి ధరలు సగటు పౌరులకు అందుబాటులో లేకుండా పోతున్నాయి. అక్రమ మార్గాల్లో పన్ను ఆశ్రయ దేశాలకు తరలిపోతున్న ధనాన్ని నిరోధించి రాజకీయ నాయకులు, కార్పొరేట్ సంస్థలు, శతకోటీశ్వరుల స్వార్థబుద్ధికి ముకుతాడు వేయాల్సిన సమయం ఆసన్నమైంది.
- ఏఏవీ ప్రసాద్
ఇదీ చూడండి: Pandora papers leak: పన్ను ఎగవేతదారులకు స్వర్గధామంగా లండన్!