జనవరి నెలలో అమెరికాలో కరోనా కట్టలు తెంచుకున్నప్పటికీ.. కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టడం, టీకా పంపిణీ వేగం పుంజుకోవడం అక్కడి ప్రజలకు ఊరటనిస్తోంది. మహమ్మారి కారణంగా ఒక్క జనవరిలోనే ఏకంగా 95వేల మంది ప్రాణాలు కోల్పోయారు. రోజుకు సగటున మూడు వేలకు పైగా మంది మృతిచెందారు.
అయితే ఫిబ్రవరి ఒకటి నాటికి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య లక్షలోపునకు పడిపోయింది. ఇది రెండు నెలల కాలంలో అత్యల్పం.
జనవరి మధ్యలో రోజుకు సగటున 2.5 లక్షల కేసులు వెలుగులోకి రాగా.. తాజాగా ఈ సంఖ్య 1.48 లక్షలకు తగ్గింది. మొత్తం యాభై రాష్ట్రాల్లో కరోనా అదుపులోకి వస్తోంది.
మరోవైపు, డిసెంబర్ మధ్యలో ప్రారంభమైన టీకా పంపిణీ కార్యక్రమం.. ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. ఇప్పటివరకు 3.11 కోట్ల డోసులను అందించారు. జో బైడెన్ ప్రమాణస్వీకారం చేసిన జనవరి 20 నుంచే 1.46 కోట్ల డోసులను పంపిణీ చేయడం విశేషం.
శాశ్వతంగా కరోనా!
ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం ఆవశ్యకతను అమెరికా అంటువ్యాధుల శాస్త్ర నిపుణుడు డా. ఆంటోనీ ఫౌచీ మరోసారి ప్రస్తావించారు. అన్నిదేశాల్లో టీకా పంపిణీ చేపట్టకపోతే.. కరోనాకు కారణమయ్యే వైరస్ ఏదో మూల శాశ్వతంగా ఉండిపోతుందని హెచ్చరించారు. అదే జరిగిదే.. వైరస్ అంతమయ్యే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
డిమాండ్‌తో పోలిస్తే వ్యాక్సిన్ సరఫరాలో చాలా వెనకబడి ఉన్నామని అన్నారు ఫౌచీ. ఇటీవల రెండు వ్యాక్సిన్ క్యాండిడేట్లు కొత్త రకం మ్యూటేషన్లపై తక్కువ ప్రభావవంతంగా ఉన్నాయని ఫలితాల్లో తేలిందని చెప్పారు. అయితే, వ్యాక్సిన్ సమర్థత కన్నా, ఎంత వేగంగా టీకా అందిస్తున్నామనే అంశంపైనే వైరస్ కట్టడి ఆధారపడి ఉంటుందని చెప్పారు. మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించడం వైరస్‌ను నియంత్రించేందుకు ఉత్తమ సాధనాలని పునరుద్ఘాటించారు.
ఇదీ చదవండి: నాసాలో కీలక పదవికి భారత సంతతి మహిళ ఎంపిక