ప్రపంచాన్ని కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తోంది. తాజాగా కరోనా కేసుల సంఖ్య 20 లక్షల 14 వేలు దాటింది. కరోనా మరణాలు 1 లక్షా 27 వేలుకు మించాయి. అయితే సుమారు 4 లక్షల 92 వేల మంది కోలుకోవడం కాస్త ఊరట. కానీ, వెలుగుచూస్తున్న కేసులకు, వాస్తవ కేసులకు మధ్య చాలా అంతరం కనిపిస్తోంది... నిజానికి చాలా దేశాల్లో వ్యాధి లక్షణాలు బయటపడిన వారికి మాత్రమే పరీక్షలు నిర్వహించి, చికిత్స అందిస్తున్నారు.
సగం కేసులు ఐరోపాలోనే..!
ప్రపంచవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల్లో సగానికి పైగా యూరోపియన్ దేశాల్లోనే వెలుగుచూడడం గమనార్హం. యూరోపియన్ దేశాల్లో ఇప్పటి వరకు 10 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదుకాగా... 84,465 మంది మరణించారు.
మరణాలు తగ్గాయ్... కేసులు పెరిగాయ్
స్పెయిన్‌లో రోజువారీ కరోనా మరణాల సంఖ్య 523కి పడిపోయింది. మరోవైపు వరుసగా ఆరు రోజుల తరువాత పాజిటివ్ కేసుల సంఖ్య 5000కు పైగా పెరిగిపోయింది. ఇప్పటివరకు స్పెయిన్‌లో 1,77,000లకు పైగా కరోనా కేసులు నమోదవగా.. 18,579 మంది మృత్యువాతపడ్డారు.
అమెరికాలో కరోనా విజృంభణ
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఇప్పటి వరకు అక్కడ 6,09,240 కేసులు నమోదు కాగా... 26,033 మరణించారు.
పెద్దాసుపత్రిని మూసేసిన చైనా
కరోనా వ్యాప్తికి కేంద్రమైన వుహాన్‌లో 10 రోజుల వ్యవధిలో నిర్మించిన అతిపెద్ద తాత్కాలిక ఆసుపత్రిని... చైనా ప్రభుత్వం తాజాగా మూసివేసింది. కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వేలాది మంది వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు తమ స్వస్థలాలకు చేరుకున్నారని అధికారిక మీడియా తెలిపింది.
ఆర్థిక మాంద్యం దిశగా జర్మనీ
కరోనా దెబ్బకు జర్మనీ ఆర్థిక మాంద్యంలోకి పడిపోయింది. మార్చిలో ప్రారంభమైన మాంద్యం... ఈ సంవత్సరం మధ్యకాలం వరకు కొనసాగే అవకాశముందని ఆ దేశ ఆర్థికమంత్రిత్వ శాఖ ప్రకటించింది.
రష్యాలో 'పాస్' ప్రయత్నం వృథా
రష్యాలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు...కొత్తగా ప్రవేశపెట్టిన 'పాస్'ల విధానం విఫలమైంది. జనాలు ఒక్కసారిగా ఎగబడిన కారణంగా మాస్కోలోని మెట్రో స్టేషన్లు, హైవేలపై ట్రాఫిక్ జామ్‌లు చోటుచేసుకున్నాయి. దీనితో కరోనా నిర్మూలన లక్ష్యానికి తీవ్ర విఘాతం కలిగింది.
రష్యాలో ఇవాళ కొత్తగా 3,388 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 24,490కి చేరింది.
ఇదీ చూడండి: ఓసీడీ మందుతో కరోనాకు చికిత్స!