డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకునే అవకాశం ఉందని అమెరికాలోని ఎక్కువ మంది ప్రజలు భావిస్తున్నారు. ట్రంప్ అభిశంసన తీర్మానంపై బహింరంగ విచారణ జరుగుతున్న సందర్భంగా ఏబీసీ న్యూస్-ఇప్సోస్ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. సర్వేలో పాల్గొన్న వారిలో 51 శాతం మంది ప్రజలు అమెరికా సెనెట్‌లో ట్రంప్ దోషిగా తేలాలని కోరుకుంటున్నట్లు స్పష్టమైంది. అభిశంసనకు సానుకూలంగా ఉన్నవారిలో 6 శాతం మంది ట్రంప్‌ను అధ్యక్ష పదవి నుంచి తప్పించడానికి విముఖత చూపిస్తున్నట్లు తెలిసింది.
అభిశంసన తీర్మాణంపై విచారణ ప్రారంభానికి ముందు కంటే ఈ సంఖ్య పెరగడం గమనార్హం. అంతకు ముందు ఫైవ్థర్టీఎయిట్ వెబ్సైట్ నిర్వహించిన సర్వేలో ట్రంప్‌కు వ్యతిరేకంగా 48 శాతం మంది తమ అభిప్రాయాలు వెల్లడించారు.
రెండిట్లోనూ పెరుగుదల
ట్రంప్ అభిశంసనకు వ్యతిరేకించే వారి సంఖ్య సైతం గణనీయంగా తగ్గింది. ఫైవ్థర్టీఎయిట్ నిర్వహించిన సర్వేలో వీరి సంఖ్య 46 శాతం ఉండగా ఏబీసీ న్యూస్ సర్వేలో 38 శాతంగా నమోదైంది. సర్వేలో పాల్గొన్న వారిలో పావు శాతం మంది ట్రంప్ ఎలాంటి తప్పు చేయలేదని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
పద్దెనిమిదేళ్లు నిండినవారిలో 58 శాతం మంది అమెరికన్లు అభిశంసన ప్రక్రియను శ్రద్ధగా గమనిస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది. మిగిలిన 42 శాతం మంది అంతగా శ్రద్ధ కనబర్చడం లేదని సర్వే తెలిపింది.