కరోనా విజృంభణతో అనేక దేశాలు లాక్డౌన్లోకి వెళ్లిపోయాయి. దీంతో విద్యాసంస్థలను మూసివేశాయి ఆయా ప్రభుత్వాలు. ఫలితంగా ఆ ప్రభావం 154 కోట్ల మంది విద్యార్థులపై పడినట్లు యునెస్కో ప్రకటించింది. అయితే బాలికలపైనే లాక్డౌన్ ప్రభావం అధికంగా ఉంటుందని వెల్లడించింది. ఇకపై పాఠశాలలకు వెళ్లే బాలికల సంఖ్య తగ్గే అవకాశం అధికంగా ఉంటుందని భావించింది.
ముఖ్యంగా కౌమారదశలో ఉన్న బాలికలను లాక్డౌన్ తీవ్రంగా ప్రభావితం చేస్తుందని, తద్వారా విద్యాసంస్థలకు వెళ్లే వారి సంఖ్య తగ్గుతుందని పేర్కొంది. లింగ అంతరాలు పెరిగిపోతాయని, చిన్న వయస్సులోనే వారికి బలవంతంగా వివాహాలు చేస్తారని, ఫలితంగా త్వరగా గర్భం దాల్చే అవకాశాలు ఉంటాయని యునెస్కో విద్యా విభాగానికి చెందిన అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ స్టెఫానియా జియానిని అభిప్రాయపడ్డారు.
"ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో 89 శాతం మంది విద్యార్థులు పాఠశాలలకు దూరంగా ఉన్నారని మేము అంచనాకు వచ్చాం. 74 కోట్ల మంది బాలికలతో సహా మొత్తం 154 కోట్ల మంది విద్యార్థులు పాఠశాలలు, విశ్వవిద్యాలయాల్లో చేరారు. వీరిలో 11 కోట్ల మంది బాలికలు అభివృద్ధి చెందని దేశాల్లో నివసిస్తున్నారు. ఇప్పటికీ వీరు విద్యను అభ్యసించటంలో ఇబ్బందులు ఎదుర్కొంటునే ఉన్నారు."
-స్టెఫానియా జియానిని, అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్, యునెస్కో
అభివృద్ధి చెందని దేశాల్లో కరోనా వైరస్ సృష్టించిన ఆర్థిక సంక్షోభం కారణంగా పాఠశాలలకు వెళ్లే బాలికల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని యునెస్కో అభిప్రాయపడుతోంది. వివిధ దేశాలు తమ పాఠశాలలను నిరవధిక వాయిదాను ప్రకటించేటప్పుడు బాలికలు ఎదుర్కొనే సమస్యల పరిష్కారాలపై దృష్టి సారించాలని విధాన రూపకర్తలు, అభ్యాసకులకు సూచించింది. వివిధ మార్గాల ద్వారా బాలికలు విద్య అభ్యసించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను కోరింది యునెస్కో. దూరవిద్యను ప్రోత్సహిస్తే యువతకు ఎంతో దోహదపడుతోందని తెలిపింది.