చైనాను, ఆ 'దేశ దోపిడీ', దూకుడు విధానాలను కట్టడి చేయగల వ్యక్తి ట్రంప్ మాత్రమేనని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో అభిప్రాయపడ్డారు. కరోనాతో అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక విధ్వంసానికి కారణమైన చైనాను చట్టం ముందు నిలబెట్టేంతవరకు ట్రంప్ విశ్రమించరని అన్నారు.
జెరుసలెం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్లో పాల్గొన్న పాంపియో... ప్రతి విషయంలో అధ్యక్షుడు ట్రంప్ దూకుడైన నిర్ణయాలు తీసుకున్నారని చెప్పుకొచ్చారు.
"కరోనా వ్యాప్తి ద్వారా అమెరికాలో మరణాలతో పాటు ఆర్థిక విధ్వంసానికి పాల్పడింది చైనా. వైరస్ విషయాన్ని దాచిపెట్టినందుకు చైనాను ట్రంప్ జవాబుదారీ చేశారు. పూర్తి న్యాయం జరిగేంతవరకు ట్రంప్ విశ్రమించరు."
-మైక్ పాంపియో, అమెరికా విదేశాంగ మంత్రి
అమెరికాలో దౌత్యవేత్తలుగా నటిస్తున్న చైనా కమ్యునిస్టు పార్టీ గూఢచారులను ట్రంప్ వెనక్కి పంపిచారని పాంపియో పేర్కొన్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థను దోచుకున్న చైనా వాణిజ్య ఒప్పందాలను రద్దు చేశారని తెలిపారు.
ట్విట్టర్ ద్వారా..
మరోవైపు.. ట్రంప్ హయాంలో దేశంలో కొత్తగా ఉద్యోగాలు పుట్టుకొస్తున్నట్లు పాంపియో తెలిపారు. అమెరికా భద్రత కోసం అధ్యక్షుడు పూర్తి భరోసా ఇచ్చి, ప్రజల స్వేచ్ఛను కాపాడారని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.