Omicron Spread In America: అమెరికాలో దాదాపు ఐదు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు వెలుగుచూశాయి. అగ్రరాజ్యంలో మొదటి ఒమిక్రాన్ కేసు కాలిఫోర్నియాలో బయటపడగా.. గురువారం న్యూయార్క్‌నగరంలో ఐదుగురికి ఈ వేరియంట్ నిర్ధరణ అయినట్లు అధికారులు తెలిపారు. దీంతో అమెరికాలో మొత్తం ఒమిక్రాన్ కేసులు ఎనిమిదికి చేరినట్లు స్పష్టం చేశారు.
దీన్నిబట్టి ఒమిక్రాన్ వేరియంట్లో చోటుచేసుకున్న మ్యుటేషన్లు ఎంతవేగంగా, సమర్థంగా వ్యాప్తి చెందుతున్నాయో అర్థం అవుతుందన్నారు. ఒమిక్రాన్ సోకిన బాధితుల్లో కొందరు.. అసలు ఇంట్లో నుంచి బయటకే రాలేదని.. అంటే అమెరికాలో ఒమిక్రాన్ ఇంతకుముందే వ్యాప్తిచెంది ఉండొచ్చన్నారు.
WHO Team To South Africa: కరొనా కొత్తవేరియంట్ ఒమిక్రాన్ దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన నేపథ్యంలో.. అక్కడి పరిస్థితిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక వైద్య బృందాన్ని ఆ దేశానికి పంపించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ). ఒమిక్రాన్ తొలికేసు నమోదైన గుటాంగ్ ప్రావిన్స్‌లో తమ బృందం పర్యటిస్తుందని డబ్ల్యూహెచ్ఓ స్థానిక అత్యవసర విభాగ డైరెక్టర్ డాక్టర్. సలామ్ గుయె పేర్కొన్నారు. రోజుల వ్యవధిలోనే ప్రపంచవ్యాప్తంగా 25కుపైగా దేశాలకు ఈ వేరియంట్ విస్తరించినట్లు తెలిపారు.
Singapore Omicron Cases: సింగపుర్‌లో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఇద్దరికి ఒమిక్రాన్ నిర్ధరణ అయినట్లు అక్కడి వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. వారిని ఎవరితోనూ కలవనీయకుండా వెంటనే ఐసోలేషన్‌కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది. ఒమిక్రాన్ సోకిన ఇద్దరిలోనూ స్వల్పలక్షణాలే ఉన్నాయని అధికారులు తెలిపారు.
Malaysia Omicron Cases: మలేషియాలో ఒమిక్రాన్ వేరియంట్ మొదటి కేసు నమోదైంది. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన 19ఏళ్ల విదేశీ యువతికి ఒమిక్రాన్ నిర్ధరణ అయినట్లు మలేషియా వైద్యశాఖ మంత్రి ఖైరీ జమాలుద్దీన్ తెలిపారు. దీంతో ఆమెతోపాటు ఉన్న నలుగురిని క్వారంటైన్లో ఉంచినట్లు వివరించారు.
ఇదీ చూడండి: Omicron worldwide: ఒమిక్రాన్.. ఏ దేశంలోకి ఎప్పుడు?