కరోనా వైరస్ పట్ల ప్రజల్లో చెలరేగుతున్న భయాలను పోగొట్టే ప్రయత్నం చేశారు అమెరికా మాజీ అధ్యక్షుడు బారక్ ఒబామా. ప్రజలు చేతులు శుభ్రపరుచుకుంటే చాలని, మాస్కులు ధరించవలసిన పని లేదని సూచించారు. ప్రజలు కాస్త విజ్ఞతతో ఆలోచించాలని ఆయన కోరారు.
"వైద్య సిబ్బంది కోసం మాస్కులు పొదుపు చేయండి. కరోనా భయం వీడి (ప్రజలు) ప్రశాంతంగా ఉండండి. నిపుణుల మాటలు వినండి. శాస్త్రాన్ని అనుసరించండి."
- బారక్ ఒబామా, అమెరికా మాజీ అధ్యక్షుడు
అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఇళ్లలోనే ఉండాలని సూచించారు ఒబామా. అలాగే వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రాలు తెలిపే పద్ధతులు పాటించాలని ప్రజలను కోరారు.
దుర్వినియోగంతో... కొరత
'కరోనా భయాలతో మాస్కులు, గాగుల్స్, ఇతర రక్షణ పరికరాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. దీనితో వాటిని కొంత మంది అక్రమంగా నిల్వచేస్తున్నారు. మరికొందరు దుర్వినియోగం చేస్తున్నారు. దీనితో ఆరోగ్య కార్యకర్తలకు కావాల్సిన ఈ వైద్య ఉత్పత్తుల కొరత ఏర్పడుతోందని' ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ నేపథ్యంలో ఒబామా ప్రజలకు ఈ కీలక సూచనలు చేశారు.
చట్టసభ్యులు సాయం..
అమెరికాలో ఇప్పటి వరకు కరోనా సోకి 11 మంది మరణించారు. మరో 130 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. మొత్తంగా 12 అమెరికా రాష్ట్రాల్లో ఈ వైరస్ వ్యాపించింది. దీనితో అప్రమత్తమైన చట్టసభ సభ్యులు కరోనాతో పోరాటానికి 8 బిలియన్ డాలర్లు అందించడానికి ఆమోదం తెలిపారు.
ఇదీ చూడండి: ప్రతి మహిళ ఆరుగురికి జన్మనివ్వాలి: నికోలస్ మదురో