ప్రపంచవ్యాప్తంగా కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ముఖ్యంగా అమెరికా,ఐరోపాలో ఈ మహమ్మారి ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. న్యూయార్క్‌లో వరుసగా రెండో రోజు అత్యధిక మరణాలు సంభవించాయి. గడిచిన 24 గంటల్లో 779 మంది కరోనాతో మృతి చెందారు. రాష్ట్రంలో ఒక్కరోజులో ఇవే అత్యధిక మరణాలు.
మంగళవారం 731 మందిని మహమ్మారి బలిగొంది. భవిష్యత్తులో మరిన్ని మరణాలు సంభవించే అవకాశం ఉందని రాష్ట్ర గవర్నర్ హెచ్చరించారు.
అంతకుమించి...
ప్రస్తుతం న్యూయార్క్‌లో వైరస్‌తో మృతి చెందిన వారి సంఖ్య.. 9/11 దాడుల్లో చనిపోయిన వారి సంఖ్యను అధిగమించినట్లు రాష్ట్ర గవర్నర్ తెలిపారు. ఉగ్రదాడిలో 2,753 మంది మరణించగా.. కరోనాకు 6,268 మంది బలైనట్లు పేర్కొన్నారు.
అమెరికాలో బుధవారం నాటికి కరోనా బాధితుల సంఖ్య 4 లక్షలు దాటింది. సుమారు 14 వేలమందికి పైగా వైరస్‌తో మృత్యువాత పడ్డారు. ఇప్పటివరకు ప్రప్రంచవ్యాప్తంగా అత్యధిక మరణాలు సంభవించిన ఇటలీ, స్పెయిన్ దేశాలకు చేరువలో అమెరికా ఉంది.
70 శాతం అక్కడే...
ఫ్రాన్స్‌లోనూ గత 24 గంటల వ్యవధిలో 541 మంది మహమ్మారి బారిన పడి మరణించారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 10,869 మందిని వైరస్ పొట్టన పెట్టుకుంది. ప్రస్తుతం 7,148 మంది ఇంటెన్సీవ్ కేర్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
60 వేలు దాటేసింది...
ఐరోపాలో బుధవారం సాయంత్రం నాటికి కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 60 వేలు దాటింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన మరణాల్లో 70 శాతం ఐరోపాలోనే సంభవించాయని అధికారులు పేర్కొన్నారు.