అగ్రరాజ్యం అమెరికాకు 46వ అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌కు మన దేశంతో బంధుత్వం ఉంది. ముంబయిలో తన బంధువులు ఉన్నట్లు బైడెన్ ఇప్పటికే పలుమార్లు చెప్పారు. తాజాగా ఆయనకు తమిళనాడులోనూ పూర్వీకులు ఉన్నట్లు తెలుస్తోంది. లండన్‌కు చెందిన కింగ్స్ కాలేజీ విజిటింగ్ ఫ్రొఫెసర్ టిమ్ విల్లాసే-విల్సే తెలిపిన వివరాల మేరకు.. 19వ శతాబ్దంలో బైడెన్ పూర్వీకులు ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధ్వర్యంలో చెన్నైలో పనిచేశారు.
జో బైడెన్ పూర్వీకులైన క్రిస్టోఫర్, విలియమ్ బైడెన్ సోదరులు ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేసేవారు. లండన్ నుంచి ఇండియాకు షిప్‌లను తీసుకొచ్చేవారు. ఈ క్రమంలో విలియమ్ చిన్నవయసులోనే చనిపోగా క్రిస్టోఫర్ తన కెరీర్‌లో చాలా కాలం షిప్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆయన జీవితంలో సింహభాగం మద్రాసులో గడిపారని విజిటింగ్ ఫ్రొఫెసర్ విల్సే వివరించారు.
ఇప్పటికీ తెలుసు..
మద్రాసు నుంచి ఆధునిక చెన్నైగా మారిన తమిళనాడులో చాలా మందికి క్రిస్టోఫర్ బైడెన్ గురించి తెలుసని ఇండియన్ కౌన్సెల్ ఆఫ్ గ్లోబుల్ రిలేషన్ పబ్లికేషన్స్ ఆగస్టులో ప్రచురించిన టిమ్ ఆర్టికల్ వివరిస్తోంది. 2015లో వాషింగ్టన్‌లో జరిగిన కార్యక్రమంలో తనకు ముంబయిలో మూలాలు ఉన్నట్లు వివరించారు. ఈస్ట్ ఇండియా ట్రేడింగ్ కంపెనీలో కెప్టెన్‌గా పనిచేసిన జార్జ్ బైడెన్ వరుసకు ముత్తాత అవుతారని జో తెలిపారు.
అయితే జార్జ్ బైడెన్ ఇండియాలో ఉన్నట్లు తెలిపే రికార్డులు లేవని వివరించిన టిమ్ క్రిస్టోఫర్, విలియమ్ సోదరుల గురించి ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. తమ ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో ఈ ఇద్దరు సోదరులు కష్టమైన మార్గమైనా లండన్ నుంచి ఇండియాకు షిప్‌లు తీసుకొచ్చే కెప్టెన్లుగా వ్యవహరించారని టిమ్ ఆర్టికల్‌లో తెలిపారు. క్రిస్టోఫర్ మద్రాసులోనే మరణించారని ఆయన గుర్తుగా చెన్నైలోని కేథడ్రల్ చర్చిలో శిలాఫలకం ఉన్నట్లు ఆయన వివరించారు.
ఇదీ చూడండి: బైడెన్‌కు ముంబయితో సంబంధమేంటి?