చాలా కాలంగా మానవ శరీర సాధారణ ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్‌గా పరిగణిస్తారు. అయితే, ఇది 36.5 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గుతుందని.. బొలీవియన్ ఫొరేజర్ రైతులపై దీర్ఘకాలిక అధ్యయనం ద్వారా శాస్త్రవేత్తలు ఆధారాలు కనుగొన్నారు.
ఈ పరిశోధన వివరాలు సైన్స్ అడ్వాన్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. మొత్తం 18 వేల మందిపై ఈ పరిశోధనలు చేశారు. 2000 సంవత్సరం నుంచి చూస్తే.. శరీర గరిష్ఠ ఉష్ణోగ్రత ఏటా దాదాపు 0.05 యూనిట్లు మార్పు చెంది 2018 నాటికి 36.5 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గినట్లు గుర్తించారు.
కారణాలు..
గతంతో పోలిస్తే పెరుగుతున్న ఆధునిక వైద్య సదుపాయాలు, తేలికపాటి ఇన్ఫెక్షన్ల రేటులో తగ్గుదల.. ఉష్ణోగ్రతలో మార్పునకు కారణమై ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. చికిత్స విధానంలో మార్పులు, వ్యాధుల సంక్రమణ రేటులో ఆలస్యం కూడా ప్రభావం చూపించే అవకాశం ఉందన్నారు.
గతంతో పోలిస్తే శారీరక శ్రమ తగ్గడం, కాలనుగుణంగా ఎయిర్ కండిషనర్లను వాడటం వల్ల శరీర ఉష్ణోగ్రత నియంత్రణ కష్టమైపోతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఉష్ణోగ్రత క్షీణత అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందని వివరించారు.
ఇదీ చూడండి: కరోనా బాధితుల్లో విటమిన్-డి లోపం!