అమెరికాలో నల్ల జాతీయుడు జాకబ్ బ్లేక్పై కాల్పులు జరిపిన పోలీసు అధికారిపై ఎలాంటి నేరాభియోగాలు మోపబోమని విస్కాన్సిన్ అటార్నీ జనరల్ మైకేల్ గ్రావేలే తెలిపారు. ఘటనపై దర్యాప్తు జరిపిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంగళవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. జాకబ్ బ్లేక్కు కూడా ఈ విషయాన్ని ముందుగానే తెలిపినట్లు పేర్కొన్నారు.
విస్కాన్సిన్లోని కెనోషాలో 29 ఏళ్ల జాకబ్ బ్లేక్పై గతేడాది ఆగస్టు 23న పోలీసు అధికారి రస్టెన్ శెష్కే కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బ్లేక్.. పక్షవాతానికి గురయ్యారు. పోలీసు అధికారి కాల్పులు జరిపిన దృశ్యాలను స్థానికుడు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాడు. అనంతరం విస్కాన్సిన్ నగరం నిరసనలతో అట్టుడుకింది. నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ పట్ల పోలీసులు క్రూరంగా వ్యవహరించి అతడి మరణానికి కారణమైన మూడు నెలల తర్వాత బ్లేక్ ఘటన జరిగింది. పోలీసులు అధికారుల జాత్యహంకారాన్ని నిరసిస్తూ ఆందోళనకారులు హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. మొత్తం 250మందిని పోలీసులు అరెస్టు చేశారు.
కాల్పులు జరిపిన సమయంలో పోలీసులకు, బ్లేక్కు మధ్య వాగ్వాదం జరిగింది. అధికారుల వద్దంటున్నా ఎస్యూవీ వాహనం డోర్ తెరిచేందుకు వెళ్లిన బ్లేక్ను రస్టెన్ చొక్కా పట్టుకుని లాగి 7 రౌండ్ల కాల్పులు జరిపారు. విధుల్లో భాగంగానే ఇలా చేయాల్సి వచ్చిందని దర్యాప్తులో తేలింది.