ఫిబ్రవరి 5వ తేదీని 'కశ్మీర్ అమెరికన్ డే'గా గుర్తించాలని కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని న్యూయార్క్ అసెంబ్లీ ఆమోదించింది . దీన్ని తీవ్రంగా ఖండించిన భారత్... జమ్ము కశ్మీర్ సంస్కృతిని, ఔన్నత్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం ఇదని విమర్శించింది.
అసెంబ్లీ సభ్యుడు నాదర్ సయేగ్ సహా 12 మంతి శాసనసభ్యులు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. "కశ్మీర్ సమాజం ప్రతికూలతలను అధిగమించింది. పట్టుదలతో ఉంది. న్యూయార్క్ వలసవాదులందరిలో ఓ ప్రత్యేక స్థానం సంపాదించించుకుంది. కశ్మీరీ ప్రజలకు మత స్వేచ్ఛ, భావవ్యక్తీకరణ స్వేచ్ఛ మొదలైన మానవహక్కులను కల్పించడానికి న్యూయార్క్ ప్రయత్నిస్తుంది" అని తీర్మానంలో పేర్కొన్నారు.
ఈ తీర్మానంపై స్పందించిన వాషింగ్టన్‌లోని భారత దౌత్యకార్యాలయ ప్రతినిధి... అమెరికా లాగే భారత్ కూడా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని అన్నారు. భిన్నమైన సంస్కృతికి భారత్ నిదర్శమని తెలిపారు. అందులో జమ్ము కశ్మీర్ భాగమేనని గుర్తుచేశారు. అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం సరికాదని అన్నారు. ఇది ప్రజలను విడదీసే ప్రయత్నమని తెలిపిన ఆయన.... న్యూయార్క్‌లోని శాసనసభ్యులను కలిసి భారత్-అమెరికా సత్సంబంధాలు, ప్రవాస భారతీయులపై చర్చిస్తామని వెల్లడించారు.
ఇదీ చదవండి:తైవాన్‌లోకి చైనా మరో చొరబాటు యత్నం!