అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా)కు చెందిన వాయేజర్-2 వ్యోమనౌక సౌర కుటుంబ పరిధిని దాటి వెళ్లిపోయింది. సూర్యుడి ప్రభావం లేని, తారాంతర మాధ్యమాన్ని (ఇంటర్స్టెల్లార్ స్పేస్ మీడియం-ఐఎస్ఎంకు)చేరుకుంది. భూమి నుంచి పయనమైన 4 దశాబ్దాల తర్వాత వ్యోమనౌక ఈ లక్ష్యాన్ని సాధించింది. ఈ ఘనత సాధించిన రెండో వ్యోమనౌకగా చరిత్ర సృష్టించింది. 2012లో వాయేజర్-1 ఆ ప్రత్యేకతను అందుకుంది. 1977లో వాయేజర్1, 2 వ్యోమనౌకలను ప్రయోగించింది నాసా.
సూర్యుడి నుంచి వెలువడే గాలులు.. సౌర కుటుంబం చుట్టూ బుడగ ఆకృతిలో ఒక సరిహద్దును ఏర్పరుస్తున్నాయి. గత ఏడాది నవంబర్ 5న వాయేజర్-2 ఈ ప్రదేశానికి చేరుకుందని నాసా శాస్త్రవేత్తలు తాజాగా నిర్ధరించారు. ఆ వ్యోమనౌకలోని ప్లాస్మా తరంగ పరికరంలోని ప్లాస్మా సాంద్రత ఆకస్మికంగా పెరిగిపోవడాన్ని గమనించారు. వేడి, తక్కువ సాంద్రత కలిగిన సౌర ప్లాస్మా నుంచి చల్లటి, అధిక సాంద్రత కలిగిన ఐఎస్ఎం ప్లాస్మాలోకి అది అడుగుపెట్టినట్లు వెల్లడైంది. ప్లాస్మాలు సహా ద్రవాలన్నీ నిర్దిష్ట సరిహద్దును ఏర్పరుస్తాయని ఇది స్పష్టం చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
ప్రస్తుతం సూర్యుడికి, వాయేజర్కు మధ్య దూరం 11 బిలియన్ మైళ్లుగా ఉంది. ఈ వ్యోమనౌక నుంచి భూమికి సమాచారం అందడానికి సుమారు 19 గంటల సమయం పడుతోంది.
ఇదీ చూడండి: అంతరిక్షంలోకి మందు బాటిళ్లు... ఎందుకో తెలుసా?