అంగారకుడి ఉపరితలంపైకి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) ప్రవేశ పెట్టిన ఇన్‌జెన్యూటీ హెలికాప్టర్ ఎగరడానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే హెలికాప్టర్ రోటార్లను విజయవంతంగా పరీక్షించినట్లు నాసా శుక్రవారం వెల్లడించింది. ప్రయోగానికి సంబంధించిన దృశ్యాలను రోవర్ కెమెరాల సాయంతో చిత్రీకరించి.. ట్విటర్‌లో విడుదల చేసింది. ఆదివారం నాడు హెలికాప్టర్ పైకి ఎగరనున్నట్లు నాసా వెల్లడించింది.
'హెలికాప్టర్ చురుగ్గానే పనిచేస్తోంది. దాని రోటార్ల పనితీరుపై మేం పరీక్షించాం. 50 ఆర్పీఎం వేగంతో జాగ్రత్తగా రోటార్లను పరీక్షించాం' అని హెలికాప్టర్ ఆపరేషన్స్ లీడర్ టిమ్ కన్హమ్ తెలిపారు. 'భూమితో పోలిస్తే అంగారకుడిపై గురుత్వాకర్షణ శక్తి తక్కువ.. అందుకే ల్యాండింగ్‌తో పాటు, పైకెగరడం కూడా కాస్త కష్టతరమైన విషయం. హెలికాప్టర్ ఆపరేషన్ కూడా కాస్త రిస్క్‌తో కూడుకున్న పని. కానీ ఈ ప్రక్రియ ద్వారా అంగారక గ్రహంపై ఉండే పరిస్థితుల గురించి అమూల్యమైన డేటా పొందవచ్చు' అని ప్రాజెక్ట్ మేనేజర్ ఆంగ్ వెల్లడించారు. హెలికాప్టర్ నిలువుగా పైకి ఎగిరి తిరుగుతూ పర్సెవరెన్స్ రోవర్ ఫొటోలు తీస్తుందని నాసా వెల్లడించింది.
అంగారకుడిపై జీవం పుట్టుకకు సంబంధించి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా 2020లో రోవర్‌ను పంపిన విషయం తెలిసిందే. అది ఫిబ్రవరి 18న అంగారకుడిపై ల్యాండ్ అయింది. ఆ రోవర్ నుంచి ఇన్‌జెన్యూటీ హెలికాప్టర్‌ను నాసా ఇటీవల అంగారకుడి ఉపరితలంపైకి దింపింది. ఎలాంటి సాంకేతిక సాయం లేకుండానే హెలికాప్టర్ అక్కడి వాతావరణానికి తట్టుకోగలుగుతోందని నాసా వెల్లడించింది.
ఇదీ చదవండి : మార్స్ వాతావరణాన్ని తట్టుకున్న నాసా హెలికాప్టర్