కిమ్ జొంగ్ ఉన్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కలవడం చరిత్రాత్మకమని ఉత్తర కొరియా ప్రకటించింది. ఇరు దేశాల మధ్య మైత్రి మరింత బలోపేతమైందని తెలిపింది. అణునిరాయుధీకరణలో భాగంగా మరిన్ని చర్చలు జరిపేందుకు ఇరుదేశాల నేతలు సుముఖంగా ఉన్నారని ఉత్తర కొరియా ప్రతినిధి తెలిపారు.
ఆదివారం ఉభయ కొరియాల సరిహద్దుల్లోని డీఎంజీ(సైనికరహిత) ప్రాంతానికి వచ్చిన ట్రంప్‌ను కిమ్ జోంగ్ ఉన్ కలిశారు. ఇరు దేశాధినేతలు కరచాలనం చేసుకుని ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఉత్తరకొరియాలో అడుగుపెట్టిన తొలి అమెరికా అధ్యక్షుడిగా చరిత్ర సృష్టించారు డొనాల్డ్ ట్రంప్.
ట్రంప్- కిమ్ మధ్య తొలి సమావేశం 2018 జూన్‌లో జరిగింది. ఈ భేటీకి సింగపూర్ వేదికైంది. అప్పటి నుంచి ఉత్తర కొరియా అణ్వాయుధాల నిర్వీర్యంపై ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి.
2019 ఫిబ్రవరిలో వియత్నాం వేదికగా ట్రంప్- కిమ్ రెండోసారి భేటీ అయ్యారు. అయితే ఈ సమావేశం విఫలమైంది. ఆ తర్వాత కిమ్‌ను ట్రంప్ కలవడం ఇదే తొలిసారి.