ప్రవాస భారతీయులకు ప్రదానం చేసే అత్యున్నత పురస్కారం 'ప్రవాసి భారతీయ సమ్మాన్' అవార్డును యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ అండ్ పాట్నర్‌షిప్ ఫోరం(యూఎస్ఐఎస్పీఎఫ్) అధ్యక్షుడు ముకేశ్ అఘితో పాటు మరో ముగ్గురు గెలుచుకున్నారు. వ్యాపార రంగానికి సంబంధించి ముకేశ్‌కు ఈ అవార్డు లభించింది. పర్యావరణ సాంకేతిక రంగానికి గాను అర్వింద్ ఫుకన్, భారతీయ సంపద్రాయాన్ని పెంపొందించినందుకు నీలు గుప్తా, వైద్యరంగంలో విశిష్ఠ సేవలందించినందుకు డా. సుధాకర్ జొన్నగడ్డకు ఈ అవార్డులు ప్రకటించారు. అంతేకాక అమెరికాలోని ప్రఖ్యాత భారతీయ సంఘం అయిన 'ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్'కు కూడా ఈ గౌరవం లభించింది. ఫెడరేషన్ చేసిన సామాజిక కార్యక్రమాలకు గానూ సంఘ సేవ విభాగం కింది అవార్డు లభించింది.
అమెరికాలో ఉండే ఎన్ఆర్ఐలకు ఈ బహుమతి ప్రదానం చేయడం వల్ల అమెరికా-భారత్ ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉందని ముకేశ్ అఘి తెలిపారు. మోదీ-బైడెన్ నాయకత్వంలో ఇరు దేశాలు పరస్పర అభివృద్ధి చెందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
16వ ప్రవాసి భారతీయ దినోత్సవ సదస్సును ఈ నెల 9న భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. సామాజిక, ఆర్థిక రంగాల్లో బలోపేతానికి కృషి చేసే దిశగా కేంద్రం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ క్రమంలో వివిధ రంగాల్లో విశిష్ఠ సేవలు అందిస్తోన్న భారత మూలాలుగల వ్యక్తులకు, సంఘాలకు ఈ బహుమతులను ప్రదానం చేయడం ఆనవాయితీగా వస్తోంది.