కుటుంబ వ్యాపారాన్ని స్థాపించిన భారతీయ వ్యాపారవేత్తలు సరైన వారసత్వ ప్రణాళిక లేక సతమతమవుతున్నారని ఓ సర్వేలో వెల్లడైంది. పదవీ విరమణ సమయంలో ఈ సమస్య ఎదుర్కొంటున్నట్లు తెలిపింది. భారత్లోని 53 కుటుంబ వ్యాపారాలపై సర్వే చేసింది ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ)కు చెందిన థామస్ స్కిమిధీని సెంటర్ ఫర్ ఫ్యామిలీ ఎంటర్ప్రైజ్(టీఎస్సీఎఫ్ఈ).
'ఈ సర్వేలో వెల్లడైన విషయాలు భారత్లో కుటుంబ వ్యాపారాల పరిస్థితిని ప్రతిబింబిస్తున్నాయి. భారత్లో చాలా కుటుంబ వ్యాపారాలు 1980-1990ల మధ్య ప్రారంభమయ్యాయి. ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన కాలంలో ప్రారంభమైన ఈ వ్యాపారాలను కొనసాగించడానికి సరైన వారసత్వ ప్రణాళికలు వ్యవస్థాపకుల వద్ద లేవు. మారుతున్న పరిణామాలు, భవిష్యత్ తరాల దృష్టికోణంలో మార్పు, ఇతర సామాజిక మార్పులు.. పదవి విరమణ, వారసత్వం, నిర్వహణ వంటి అంశాలపై ప్రభావం చూపుతున్నాయి.'
-నుపుర్ పవన్ బాంగ్, టీఎస్సీఎఫ్ఈ అసోసియెట్ డైరెక్టర్
ప్రపంచవ్యాప్తంగా...
ఐఎస్బీ తరహాలో ప్రపంచవ్యాప్తంగా 33 దేశాలలోని 1800 కుటుంబ వ్యాపారాలపై 48 విశ్వవిద్యాలయాలు కలసికట్టుగా సర్వే నిర్వహించాయి. ఆయా సంస్థల సీఈఓలలో సగం మందికి సరైన పదవీ విరమణ ప్రణాళికలు లేవని తేల్చాయి. 70 శాతం కుటుంబ వ్యాపారాలు వారసత్వ ప్రణాళిక లేకుండా సతమతమవుతున్నట్లు వివరించాయి.
సరైన ప్రణాళికతో ముందుకు
సామాజిక మార్పులను దృష్టిలో ఉంచుకొని సవాళ్లను అధిగమించాలని సూచించారు నుపుర్. వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఎప్పటికప్పుడు సరైన ప్రణాళికలు వేసుకోవడం ద్వారా దీర్ఘకాలం పాటు కుటుంబ వ్యాపారాలను కొనసాగించవచ్చని పేర్కొన్నారు.