చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలకు వ్యాపించి మృత్యు క్రీడలాడుతోంది. తాజా ఈ వైరస్ సోకిన బాధితుల సంఖ్య 9 లక్షల 50 వేలు చేరింది. మృతుల సంఖ్య 48వేలకు పైమాటే. ఊరట కలిగించే అంశం ఏమిటంటే ఇప్పటి వరకు కరోనా బారి నుంచి 2 లక్షల మందికిపైగా కోలుకున్నారు.
ఐరోపాలో మరణమృదంగం
కరోనా కేసులు యూరప్‌లో 5 లక్షలను మించిపోయింది. ముఖ్యంగా ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్‌ల్లో కరోనా కేసులు, మరణాలు అధికంగా సంభవిస్తున్నాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) గణాంకాల ప్రకారం, కరోనా మృతుల్లో 95 శాతం కంటే ఎక్కువ మంది 60 ఏళ్లు పైబడినవారే కావడం గమనార్హం. వీరిలోనూ ప్రతి ఐదుగురిలో నలుగురికి గుండె జబ్బులు, రక్తపోటు, మధుమేహం లాంటి దీర్ఘకాలిక రోగాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.
అయితే వృద్ధాప్య సమస్యలు మాత్రమే కరోనా విజృంభణకు కారణం కాదని, యువతకు కూడా ఈ వైరస్ సోకే ప్రమాదముందని డాక్టర్ హన్స్ కుగ్లే వెల్లడించారు.
స్పెయిన్‌లో రికార్డు మరణాలు..
కరోనా ధాటికి ఇటలీ తరువాత అంతగా నష్టపోయిన దేశం స్పెయిన్. గడిచిన 24 గంటల్లో అక్కడ 950 మంది కరోనా బారిన పడి మరణించారు. దీనితో మొత్తం కరోనా మృతుల సంఖ్య 10,003కు చేరుకుంది. మరోవైపు ధ్రువీకరించిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్షా 10వేలను దాటింది.
అయితే దేశంలో కేసులు, మరణాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయని స్పెయిన్ ఆరోగ్య మంత్రిత్వశాఖ గణాంకాలు చెబుతున్నాయి.
అక్కడ పెరుగుతున్న తీవ్రత...
బెల్జియంలో కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరిగిపోతోంది. తాజాగా అక్కడ నమోదైన కరోనా మృతుల సంఖ్య 1000 దాటింది. దేశంలోని కరోనా మరణాల్లో... 93 శాతం 65 ఏళ్లు పైబడిన వృద్ధులేనని అధికారులు తెలిపారు.
ఇరాన్:
ఇరాన్లో కొత్తగా 124 కరోనా మరణాలు సంభవించాయి. దీనితో మొత్తం కరోనా మృతుల సంఖ్య 3,160కి చేరుకుంది. ఇక్కడ గత 24 గంటల్లో 3వేలకుపైగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీనితో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 50 వేలు దాటింది.
మరో సంవత్సరం పాటు కరోనాతో పోరు తప్పదని ఆ దేశాధ్యక్షుడు హసన్ రౌహనీ ప్రజలను ఉద్దేశించి చెప్పారు.
చైనా
చైనా కరోనా నుంచి క్రమంగా కోలుకుంటోంది. ముఖ్యంగా ఈ మహమ్మారి జన్మస్థలమైన హూబే రాష్ట్రంలో కొత్తగా ఎలాంటి కేసులు నమోదు కాలేదు. అయితే విదేశాల నుంచి తిరిగి స్వస్థలాలకు వచ్చిన వారిలో మాత్రం కొత్త 35 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తంగా ఇలాంటి కేసుల సంఖ్య 841కు చేరుకుంది. వీరందరినీ ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
హూబేలో బుధవారం ఆరుగురు వ్యక్తులు కరోనాతో మరణించారు. దీనితో ఇప్పటి వరకు చైనాలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3,318కి చేరింది.
విదేశాల్లో చిక్కుకున్న తమ పౌరులను తిరిగి స్వదేశానికి తీసుకొచ్చేందుకు చైనా చార్టర్డ్ ఫ్లైట్లను పంపిస్తోంది. ఇప్పటికే మార్చి 4 నుంచి 26 మధ్య ప్రత్యేక విమానాలను ఇటలీ, ఇరాన్‌లకు పంపించి 1,466 మంది తమ పౌరులను తిరిగి తమ దేశానికి రప్పించుకుంది చైనా.
ఫ్రాన్స్, ఇటలీ, అమెరికా, యూకేల్లో చిక్కుకున్న మరింత మంది తమ పౌరుల కోసం... చైనా 116 టన్నుల వైద్య పరికరాలు, ఔషధాలు పంపిస్తోంది.
ప్రపంచానికి సాయం చేస్తాం..!
కరోనాపై పోరాడేందుకు ఓ 40 దేశాలకు 100 మంది వైద్య నిపుణులను పంపిస్తామని చైనా స్పష్టం చేసింది. అలాగే 2,635 టన్నుల వైద్య సామగ్రిని 178 విమానాల్లో ఆయా దేశాలకు పంపిస్తామని పేర్కొంది.
ఇదీ చూడండి: అమెరికాకు మరింత కష్టం- నిండుకున్న 'అత్యవసర' నిల్వలు!