కొవిడ్ నివారణకు అమెరికాకు చెందిన మోడెర్నా అభివృద్ధి చేస్తున్న టీకా ప్రయోగాల మధ్యంతర ఫలితాలు నవంబర్‌లో వెలువడవచ్చని ఆ సంస్థ సీఈఓ స్టెఫానీ బన్సెల్ పేర్కొన్నారు. ఇవి సానుకూలంగా ఉంటే దీని అత్యవసర వినియోగానికి డిసెంబర్‌లో ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. అమెరికాకు చెందిన వాల్‌స్ట్రీట్ జర్నల్‌తో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. ఒక వేళ ఆశించిన ఫలితాలు రాకపోతే వచ్చే ఏడాది ప్రారంభం వరకు ఎటువంటి అనుమతులూ వచ్చే అవకాశం లేదని వివరించారు. ప్రయోగ ఫలితాల విశ్లేషణ నవంబర్‌లో ఏ వారంలో జరుగుతుందో కచ్చితంగా చెప్పలేమన్నారు.
కొవిడ్ టీకాలను వేగంగా అభివృద్ధి చేస్తున్న కంపెనీల్లో మోడెర్నా కూడా ఒకటి. జులైలో ప్రయోగాలను మొదలుపెట్టిన ఆ కంపెనీ దాదాపు 30,000 మందిపై వివిధ దశల్లో ప్రయోగాలు జరిపింది. ఇప్పటి వరకు ఈ టీకా ప్రయోగాలు సజావుగా సాగాయి. ప్రస్తుతం 53 మందిలో కొందరిపై టీకాను ప్రయోగించగా.. మరికొందరిపై ప్లెసిబోను (ఎటువంటి ప్రభావం చూపని పదార్థం)ను ప్రయోగిస్తారు. టీకా తీసుకొన్న వారిలో ఎంత మంది కొవిడ్ బారిన పడ్డారన్న అంశాన్ని బట్టి ప్రభుత్వం అత్యవసర వినియోగానికి అనుమతులు మంజూరు చేస్తుంది. ఇప్పటికే ఫైజర్ కూడా వీలైనంత త్వరగా టీకాను మార్కెట్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది.