Bill Gates news: దిగ్గజ సాఫ్ట్వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సంస్థలో లైంగిక వేధింపుల ఆరోపణలు, లింగ వివక్షకు సంబంధించిన ఫిర్యాదుల దర్యాప్తు వివరాలను బహిరంగంగా వెల్లడించనున్నట్లు తెలిపింది. ఇందుకు అనుగుణంగా తమ విధానాలను సమీక్షిస్తామని చెప్పింది. బిల్ గేట్స్ సహా బోర్డు డైరెక్టర్లందరికీ ఇది వర్తిస్తుందని చెప్పింది.
సంస్థ విధానాలను సమీక్షించేందుకు థర్డ్ పార్టీ న్యాయ సంస్థను మైక్రోసాఫ్ట్ నియమించుకోనున్నట్లు 'ది సియాటెల్ టైమ్స్' కథనం ప్రచురించింది. ఇతర సంస్థలు ఎలాంటి విధానాలు పాటిస్తున్నాయి, ఉద్యోగులను, ఎగ్జిక్యూటివ్‌లను జవాబుదారీగా ఉంచేందుకు ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే అంశాలను థర్డ్ పార్టీ సంస్థ పరిశీలించనుంది. మైక్రోసాఫ్ట్‌లో ఎన్ని లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ జరిగింది, వాటిపై తీర్మానాలేంటి? అనే వివరాలను సమీక్ష అనంతరం బహిరంగంగా వెల్లడించనున్నట్లు పేర్కొంది.
కేవలం నివేదికను సమీక్షించడం సహా ఉద్యోగులకు మరింత అనువైన వాతావరణం కల్పించేందుకు ఏం చేయాలనే విషయాలను కూడా తెలుసుకుంటామని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య సత్య నాదెళ్ల ఓ ప్రకటనలో తెలిపారు.
Bill Gates sexual harassment
మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ ఓ మహిళా ఉద్యోగితో ఫ్లర్ట్ చేశారని ఆరోపణలు వచ్చిన అనంతరం 2021లో సంస్థ వాటాదారులు ఓ తీర్మానానికి ఆమోదం తెలిపారు. పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించిన విధానాలను సమీక్షించాలని నిర్ణయించారు.
ఇదీ చదవండి: ఆ మహిళా ఉద్యోగితో బిల్ గేట్స్ అలా..!