ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కొవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు శాస్త్రవేత్తలు, పరిశోధకులు వ్యాక్సిన్ ప్రయోగాలు ముమ్మరంగా జరుపుతుండగా.. వీటిపై హ్యాకర్ల కన్ను పడింది. ప్రముఖ ఫార్మా కంపెనీలు, వ్యాక్సిన్ పరిశోధకుల నుంచి విలువైన డేటాను చోరీ చేసేందుకు రష్యా, ఉత్తరకొరియా హ్యాకర్లు ప్రయత్నించినట్లు మైక్రోసాఫ్ట్ గుర్తించింది. ఈ మేరకు ఐటీ సంస్థ తన బ్లాగులో పేర్కొంది.
భారత్, కెనడా, దక్షిణకొరియా, అమెరికాలోని కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలను లక్ష్యంగా చేసుకుని వీరు హ్యాకింగ్‌కు యత్నించినట్లు మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. చాలా వరకు హ్యాకర్లు విఫలమైనట్లు తాము గుర్తించామని స్పష్టం చేసింది. అయితే ఎంతమంది హ్యాకర్లు డేటా చోరీకి పాల్పడ్డారో, వారు ఎంత ప్రమాదకరమనేది తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని తెలిపింది. రష్యా మిలిటరీ ఏజెంట్స్‌కు చెందిన ఫ్యాన్సీ బీర్, ఉత్తరకొరియాకు చెందిన లజారస్ గ్రూప్ వంటివి హ్యాకింగ్‌కు యత్నించినట్లు మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. ఫార్మా కంపెనీలు, వ్యాక్సిన్ పరిశోధకులు లాగిన్ వివరాలను చోరీ చేసేందుకు ప్రయత్నాలు జరిగినట్లు తెలిపింది.
ఈ ఏడాది జులైలో అమెరికా ప్రభుత్వం కూడా హ్యాకింగ్ ఆరోపణలు చేసింది. చైనా మద్దుతు కలిగిన హ్యాకర్లు తమ వ్యాక్సిన్ తయారీదారులను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించిన ట్రంప్ సర్కార్.. వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్లు ప్రకటించింది. మరోవైపు మైక్రోసాఫ్ట్ అధ్యక్షుడు బ్రాడ్ స్మిత్ కూడా సైబర్ దాడుల గురించి హెచ్చరించారు. సైబర్ దాడుల నుంచి ప్రపంచ దేశాలు తమ ఆరోగ్య సంరక్షణా సంస్థలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఏర్పడిందని స్మిత్ చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ రెండో దఫా విజృంభణ మొదలైంది. అగ్రరాజ్యం అమెరికా సహా ఐరోపా దేశాల్లో కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనాను ఎదుర్కొనేందుకు తమ వ్యాక్సిన్ 90శాతం ప్రభావవంతంగా పనిచేస్తోందని ఫైజర్ సంస్థ ప్రకటించడం యావత్ ప్రపంచానికి ఊరట కలిగిస్తోంది.
ఇదీ చూడండి: 'కరోనా కట్టడికి ట్రంప్ అత్యవసర చర్యలు చేపట్టాలి'