"ఆయన ఓ జాతి దురహంకారి, అమెరికా అధ్యక్షుడిగా ఏమాత్రం తగనివ్యక్తి" అంటూ అమెరికా మాజీ ప్రథమ మహిళ మిషెల్ ఒబామా.. దేశాధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్‌పై మంగళవారం తీవ్రమైన విమర్శల దాడికి దిగారు. అమెరికన్లు ఈ ఎన్నికలను దేశంలో మళ్లీ స్థిరత్వాన్ని తీసుకువచ్చే ఓ అవకాశంగా తీసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.
డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌కు మద్దతుగా ఆమె 24 నిమిషాల వీడియో విడుదల చేశారు. దేశం కష్టాల్లో ఉంది, ఇపుడేం చేయాలో ఓటర్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. 'క్లోజింగ్ ఆర్గ్యుమెంట్' పేరిట ఈ వీడియోను ఆమె సామాజిక మాధ్యమాల ద్వారా, బైడెన్ ప్రచారంలోనూ విడుదల చేశారు.
"మీరు నమ్మినా, నమ్మకపోయినా ఈ ఎన్నికలు సకాలంలో వచ్చాయి. ఓటర్లు కూడా ఎప్పుడో ఓ నిర్ణయానికి వచ్చేశారు. మీలో ఎవరైనా ఎవరికి ఓటు వేయాలో ఇప్పటికీ ఓ నిర్ణయం తీసుకోలేకుండా ఉంటే నేను మీకు గుర్తు చేస్తాను. ఈ రోజు మన దేశం ఓ అనర్హుడైన అధ్యక్షుడి కారణంగా కష్టాలకు ఎదురీదుతోంది. నవంబరు 3న అధ్యక్ష ఎన్నిక జరగనున్నప్పటికీ రాష్ట్రాల్లో ముందస్తు ఓటింగ్ అప్పుడే మొదలైంది. ఇప్పటికే మన అధ్యక్షుడు కరోనా బారిన పడ్డారు. మరోవైపు.. ఈ మహమ్మారి అంత తీవ్రమైనది కాదని చెబుతున్నారు. మాస్కు అవసరం లేదని, సామాజిక దూరం సరికాదని చెబుతారు. అధ్యక్షుడి వైఖరి సరికాదు" అంటూ ట్రంప్ తీరుపై ఆమె ధ్వజమెత్తారు.
ఈ సమస్యలకు పరిష్కారం చూపగల అధ్యక్షుడినే ఎన్నుకోవాలని అమెరికన్లకు పిలుపునిచ్చారు మిషెల్. ఒబామా దంపతులు ఈ ఎన్నికల్లో పెద్దగా ప్రత్యక్ష ప్రచారానికి వెళ్లకపోయినా.. బైడెన్‌కు మద్దతుగా తరచూ ఇటువంటి వీడియోలు విడుదల చేస్తున్నారు.