అగ్రరాజ్యంలో ప్రథమ మహిళకు కేవలం లాంఛన ప్రాయంగా కాకుండా అధికారికంగానూ ప్రాముఖ్యం ఉంది. మెలానియా ట్రంప్ ఒకప్పటి ఫ్యాషన్ ప్రపంచపు రారాణి అయితే.. జిల్ బైడెన్ చదువుల సరస్వతి. మరి ప్రథమ మహిళగా ఈ సారి ఎవరు అందలమెక్కేదీ తెలియాలంటే కొంత కాలం వేచి చూడక తప్పదు మరి!
ఈ ఇరువురి మధ్య పోలిక అనివార్యమైంది. వేషభాషల్లోనూ, గుణగణాల్లోనూ వీరిద్దరి మధ్య ఉన్న పోలికలు, వైరుధ్యాలు పరిశీలిస్తే..
విభిన్న ధ్రువాలు
'మెలానియా నేవ్స్'గా నాటి యుగోస్లేవియాలో భాగమైన స్లోవేకియాలో జన్మించారు. 2005లో ట్రంప్‌ను వివాహం చేసుకున్న ఆమెకు 2006లో అమెరికా పౌరసత్వం లభించింది. విదేశాల్లో పుట్టిన అమెరికా ప్రథమ మహిళల్లో మెలానియా రెండో వారు. ఈమె మాతృభాష ఇంగ్లీషు కాని తొలి ప్రథమ మహిళ. మెలానియా తండ్రి ప్రముఖ కార్ల కంపెనీ సేల్స్‌మేన్ కాగా తల్లి ఫ్యాషన్ రంగ ప్రముఖురాలు.
1996లో అమెరికాలో కాలుపెట్టిన మెలానియా మోడలింగ్ రంగంలో అత్యుత్తమ కెరీర్‌ను అందుకున్నారు. ట్రంప్‌కు చెందిన 'ట్రంప్ మోడల్ మేనేజ్‌మెంట్'లో కొన్నాళ్లు పనిచేయటం గమనార్హం. ఖరీదైన దుస్తులు, ఆభరణాల పట్ల మక్కువ కనబరిచే మెలానియా.. ఫ్యాషన్ ప్రపంచాన్ని నిరంతరం ఆకర్షిస్తూనే ఉన్నారు. ప్రథమ మహిళ కాకముందు క్యూవీసీ పేరుతో ఆభరణాలు, సౌందర్య సాధనాల బ్రాండ్‌తో వాణిజ్యవేత్తగా కూడా మారారు. డొనాల్డ్ ట్రంప్ మూడో భార్య అయినా ప్రథమ మహిళ కాగలిగారు. భర్త అధ్యక్ష హోదాకు తన గ్లామర్‌తో హంగును తెచ్చారు.
ఇక మరోవైపు 69 ఏళ్ల ప్రొఫెసర్ జిల్ బైడెన్ ఫిలడెల్ఫియాలోని పల్లె ప్రాంతాల్లో పుట్టి పెరిగారు. ఆమె తండ్రి స్వయంకృషితో క్లర్కు స్థాయి నుంచి బ్యాంకు అధినేతగా ఎదిగారు. తల్లి గృహిణి. తొలుత మోడలింగ్‌పై మక్కువ చూపినా.. అనంతరం ఉన్నత విద్య వైపునకు దృష్టి మరల్చి మాస్టర్స్ డిగ్రీని, డాక్టరేట్‌ను కూడా పూర్తి చేశారు. బోధనను వృత్తిగా ఎంచుకున్న జిల్, ద్వితీయ మహిళ హోదాలో కూడా తన వృత్తిని కొనసాగించిన రెండో మహిళగా రికార్డు సృష్టించారు.
ఓ రోడ్డు ప్రమాదంలో తన తొలి భార్యను, కుమార్తెను కోల్పోయి.. ఇద్దరు కొడుకులతో చిన్న వయసులోనే ఒంటరిగా మిగిలిన బైడెన్ జీవితంలోకే కాకుండా ఆయన చిన్నారులకు మాతృమూర్తిగా జిల్ బాధ్యతలు తీసుకున్నారు. కుటుంబం బాగోగులు చూసుకుంటూనే రెండు మాస్టర్ డిగ్రీలను పొందారు. ప్రస్తుతం వర్జీనియా కమ్యూనిటీ కాలేజ్‌లో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
ఎనిమిదేళ్లు అమెరికా ద్వితీయ మహిళగా ఉన్నా తన వృత్తిని వీడలేదు. మహిళలు వ్యక్తిగత, వృత్తిగత బాధ్యతలను నిర్వహించటం అమెరికాలో సర్వసాధారణమే అయినా ప్రథమ మహిళ విషయంలో ఇప్పటి వరకు ఈ విధంగా జరగలేదు. అయితే జిల్ ఈ విషయంలో కొత్త ఒరవడి సృష్టిస్తారని అభిమానుల అభిప్రాయం. బైడెన్ అధ్యక్షుడిగా ఎన్నికైనా.. అత్యంత గౌరవనీయమైన తన వృత్తిని కొనసాగిస్తాని ఆమె ప్రకటించటం విశేషం.
అర్ధాంగిగా ఎవరెలా
క్లిష్ట సమయాల్లోనూ ప్రశాంతంగా ఉండగల మెలానియా శైలి అందుకు భిన్నంగా ఉండే ట్రంప్ దూకుడుకు కళ్లెం వేస్తుందని అంటారు. ప్రత్యేకించి జార్జి ఫ్లాయిడ్ మృతితో తలెత్తిన ఉద్రిక్తతలు, కరోనా వైరస్ సంబంధిత అంశాల్లో ఆమె స్థిరత్వాన్ని ప్రదర్శించారు. బయటకు తెలిసిన దాని కంటే మెలానియా ప్రభావం అధ్యక్షుడిపై ఎక్కువే అని సన్నిహితులు చెబుతారు.
మరోవైపు బైడెన్ రెండు సార్లు అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓడిపోయినా, ఎనిమిదేళ్ల పాటు ఉపాధ్యక్షుడిగా ఉన్నా జిల్ ఆయన వెన్నంటే నడిచారు. తొలి నుంచి ప్రస్తుత ఎన్నికల వరకూ ప్రతిసారీ ఆయన తరపున విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
ప్రస్తుతం బైడెన్ అధ్యక్ష పదవే లక్ష్యంగా స్వింగ్ స్టేట్స్‌లో నిరంతరాయంగా ప్రచార పర్వాన్ని నడుపుతున్నారు. తన కుటుంబాన్ని చక్కదిద్దుకునే వారే దేశాన్నీ చక్కదిద్దుకోగలరనే నినాదంతో జిల్ దూసుకెళ్తున్నారు. బైడెన్‌కు కవచంలాగా మారి ట్రంప్ వర్గం చేసే విమర్శల నుంచి ఆయనను కాపాడుకుంటున్నారు. బైడెన్ రాజకీయ జీవితంలో ఉత్తమ సలహాదారుగా నిలిచారు.
సామాజిక బాధ్యతల నిర్వహణలో..
మెలానియా ప్రథమ మహిళ హోదాలో తొలి అధికారిక కార్యక్రమంగా 'బీ బెస్ట్' ఉద్యమాన్ని ప్రారంభించారు. యువతపై చోటుచేసుకునే సైబర్ దాడులకు, మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా సాగే ఈ కార్యక్రమం ద్వారా ప్రజల మనసుల్లో తనదైన ముద్ర వేశారు. ఇక జిల్ బైడెన్ టబ్రెస్ట్ హెల్త్ ఇన్షియేటివ్' అనే కార్యక్రమంలో భాగంగా ఉచిత బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
విద్య విలువనెరిగిన ఉపాధ్యాయురాలిగా.. పేద కుటుంబాల చిన్నారులకు ఉచితంగా పుస్తకాలను అందించే 'బుక్ బడ్డీస్' కార్యక్రమాన్ని ప్రారంభించారు. రచయిత్రిగా చిన్నారులకు సంబంధించిన రెండు పుస్తకాలను ప్రచురించారు. అంతేకాకుండా జో సహధర్మచారిణిగా తన ప్రయాణాన్ని తన స్వీయ చరిత్ర 'వేర్ ద లైట్ ఎంటర్స్'లో చక్కగా వివరించారు. అన్నింటినీ మించి ఆమె ఓ విజయవంతమైన మారథాన్ రన్నర్ అనేది తక్కువ మందికి తెలిసిన నిజం.
విమర్శలూ ఉన్నాయి..
అసలు ప్రథమ మహిళగా క్లిష్ట బాధ్యతలను నిర్వర్తించేందుకు మెలానియా అంత సుముఖం కాదని విమర్శకులు అంటారు. అందుకే ట్రంప్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినా.. ఆమె న్యూయార్క్ నుంచి వాషింగ్టన్‌కు మారేందుకు ఐదు నెలలు పట్టిందని వారు అంటారు. ఇక అనితా హిల్ అనే లా ప్రొఫెసర్ బైడెన్‌పై చేసిన లైంగికదాడి ఆరోపణల నేపథ్యంలో.. తన భర్తను వెనకేసుకు వచ్చినందుకు జిల్ బైడెన్ కూడా విమర్శలు ఎదుర్కొన్నారు. అంతేకాకుండా అతి సాధారణంగా ఉండే జిల్ వేషధారణ అంతగా ఆకర్షణీయం కాని మాట నిజం.
అగ్రరాజ్యంలో ప్రథమ మహిళకు కేవలం లాంఛన ప్రాయంగా కాకుండా అధికారికంగా కూడా ప్రాముఖ్యం ఉంది. ప్రతి అమెరికా ప్రథమ మహిళ వేషభాషల్లో భాగమైన వస్తువులను 'ద స్మిత్‌సోనియన్ ఇన్‌స్టిట్యూషన్ మ్యూజియం'లో భద్రపరచటం ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. మెలానియా ట్రంప్ ఒకప్పటి ఫ్యాషన్ ప్రపంచపు రారాణి అయితే.. జిల్ బైడెన్ చదువుల సరస్వతి. మరి ప్రథమ మహిళగా ఈ సారి ఎవరు అందలమెక్కేదీ తెలియాలంటే కొంత కాలం వేచి చూడక తప్పదు మరి!