నలుగురు టీనేజీ బాలికలను రేప్ చేసి, దోషిగా తేలిన న్యూయార్క్ యువకుడు (US New york news today) జైలు శిక్ష తప్పించుకున్నాడు. తాను టీనేజీలో ఉన్నప్పుడు ఇంట్లో పార్టీ జరిగిన సమయంలో నలుగురిపై అత్యాచారం చేసినట్లు కోర్టు ముందు ఒప్పుకున్నాడు. నేరాన్ని అంగీకరించినందున యువకుడికి కోర్టు ఎనిమిదేళ్ల ప్రొబేషన్‌ను శిక్షగా విధించింది. జైలులో ఉండాల్సిన అవసరం లేదని కోర్టు తెలిపింది.
నిందితుడు క్రిస్టోఫర్ బెల్టర్ (Christopher Belter Buffalo) 2017 ఫిబ్రవరి, 2018 ఆగస్టు మధ్య ఈ నేరాలకు పాల్పడ్డాడు. ముగ్గురు 16ఏళ్ల బాలికలు, ఓ 15 ఏళ్ల బాలికపై నిందితుడు అత్యాచారం చేసినట్లు వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. బెల్టర్పై (Christopher belter attorney) కేసు నమోదు కాగా.. 2019లో నేరాలను అంగీకరించి క్షమాభిక్ష కోరాడు.
న్యాయమూర్తి తీర్పు...
కేసు విచారించిన నయాగారా కౌంటీ కోర్టు జడ్జి మాథ్యూ మర్ఫీ-3.. ఈ కేసులో జైలు శిక్ష విధించడం సమంజసం కాదని అన్నారు. నిందితుడికి సరైన శిక్ష విధించే విషయంపై తాను తీవ్రంగా మథనపడ్డానని చెప్పారు. ఏది సరైన శిక్ష అవుతుందనే విషయంపై తాను దేవుడిని ప్రార్థించానని తెలిపారు. అయితే, నిందితుడికి విధించిన ప్రొబేషనరీ స్టేటస్.. తర్వాతి ఎనిమిదేళ్ల పాటు అతని మెడపై కత్తిలా వేలాడుతుందని స్పష్టం చేశారు.
ముందుగా.. నిందితుడికి కోర్టు రెండేళ్ల మధ్యంతర ప్రొబేషన్ విధించింది. ఆ సమయంలో కంప్యూటర్లో సాఫ్ట్వేర్లను ఇన్స్టాల్ చేసి పోర్న్ వీక్షించాడని తేలింది. ఈ విషయాన్ని కోర్టు ముందు ఒప్పుకున్నాడు బెల్టర్.
'బాధితులకు న్యాయమేది?'
అయితే, బాధితుల తరపు న్యాయవాది మాత్రం ఈ తీర్పుపై విస్మయం వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరగలేదని అన్నారు. నిందితుడు శ్వేతజాతీయుడని, సంపన్న కుటుంబం నుంచి వచ్చాడని చెప్పారు. పద్దెనిమిదేళ్లు దాటిన తర్వాత అతడికి శిక్ష పడిందని గుర్తు చేశారు. ఇలాంటి నేరాల నుంచి వయోజనులు తప్పించుకోవడం సమాజానికి మంచిది కాదన్నారు.
బెల్టర్కు తల్లి ట్రిసియా వకాంటి, మారుతండ్రి గ్యారీ సుల్లో(56), వారి ఫ్యామిలీ ఫ్రెండ్ జెస్సికా లాంగ్(42) కలిసి బాలికలను సప్లై చేసేవారనే ఆరోపణలు ఉన్నాయని వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. మద్యం, మాదకద్రవ్యాలు సైతం అందించేవారని పేర్కొంది.
ప్రొబేషన్ అంటే??
ప్రొబేషన్ అంటే (Probation system in USA) దోషిగా తేలిన వ్యక్తి జైలు శిక్ష అనుభవించకుండా.. బయటే అధికారుల పర్యవేక్షణలో ఉండటం. కోర్టు విధించిన పలు నిబంధనలకు లోబడి దోషి జీవించాల్సి ఉంటుంది. సాధారణంగా.. తొలిసారి నేరం చేసినవారికి, తక్కువ తీవ్రత ఉన్న కేసుల్లోని నిందితులకు ప్రొబేషన్ విధిస్తారు. ప్రొబేషన్ నిబంధనలు ఉల్లంఘిస్తే.. జైలుకు పంపుతారు.
ఇదీ చదవండి: పుస్తకాలు చదివితే శిక్ష రద్దు- 'ఉగ్రవాది'కి కోర్టు వెరైటీ ఆఫర్!