అమెరికాలోని మేరిల్యాండ్‌కు చెందిన ఆక్సన్ హిల్ ప్రాంతంలో దారుణం జరిగింది. సాండ్‌విచ్ కోసం ప్రసిద్ధ పొపేయ్స్ రెస్టారెంట్లో ప్రజలు బారులు తీరిన సమయంలో ఓ వ్యక్తి మరో వ్యక్తిపై దాడి చేశాడు. కత్తితో పొడిచి అక్కడి నుంచి తప్పించుకున్నాడు. క్యూ పద్ధతిని అతిక్రమించడం వల్ల ఇద్దరి మధ్య ప్రారంభమైన ఘర్షణ... ఒకరి ప్రాణాలు తీసుకుంది.
ఇదీ జరిగింది...
అమెరికాలోని మేరీల్యాండ్‌కు చెందిన ఆక్సన్ హిల్ ప్రాంతంలో పొపేయ్స్ పేరిట ఫ్రైడ్ చికెన్ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్‌ను పున:ప్రారంభించారు. ఈ రెస్టారెంట్‌లోని చికెన్ సాండ్‌విచ్ కోసం ప్రజలు బారులు తీరారు. వారిని అదుపుచేసేందుకు క్యూ పద్ధతిని ఏర్పాటు చేశారు అధికారులు.
ఇంతలో ఓ వ్యక్తి అందరినీ దాటేసి ముందుకెళ్లడానికి ప్రయత్నించాడు. వరుసలో నిల్చున్న ఓ వ్యక్తి అతడిని అడ్డుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య వాగ్యుద్ధం జరిగింది. కోపంతో ఊగిపోయిన వ్యక్తి... తనను అడ్డుకున్న మనిషిని కత్తితో పొడిచి చంపేశాడు నిందితుడు. అనంతరం అక్కడి నుంచి తప్పించుకున్నాడు.
కత్తిపోటుతో రక్తపు మరకలతో పడి ఉన్న బాధితుడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆలస్యమైందని.. బాధితుడు మరణించాడని వైద్యులు తెలిపారు.
ఈ ఘటనపై రెస్టారెంట్ నిర్వాహకులు స్పందిచడానికి నిరాకరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.