దగ్గు, తుమ్ము, జలుబు, ఊపిరి తీసుకోవడం ఇబ్బంది.. ఇవీ ప్రపంచ మహమ్మారి కరోనా వైరస్ లక్షణాలు. ముఖ్యంగా ఊపిరి పీల్చుకునేటప్పుడు నొప్పి తీవ్రంగా ఉందని చెప్పారు బాధితులు. అయితే... ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నా, వెంటిలేటర్లపై ఉన్నా.. ముఖాన్ని కిందకు పెడితే ఊపిరి పీల్చుకోవడం సులభమవుతుందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. ఇలా చేస్తే ఊపిరితిత్తులపై అధిక భారం పడదని అంటున్నాయి.
చైనాలోని వుహాన్ జిన్యితాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 12మంది రోగులపై 6 రోజులపాటు ఈ అధ్యయనం చేశారు. అమెరికా జర్నల్ ఆఫ్ రెస్పిరేటరీ అండ్ క్రిటికల్ కేర్ మెడిసిన్‌లో పరిశోధన వివరాలు ప్రచురించారు.
ప్రోన్ పొజీషనింగ్...
ఇలా మంచంపై ముఖాన్ని కిందకు వంచిన స్థితిని ప్రోన్ పొజీషనింగ్ అంటారు. వుహాన్‌లోని ఆరోగ్య సిబ్బంది రిక్రూట్మెంట్-టు-ఇన్ఫ్లేషన్ రేషియోను వినియోగిస్తారు. ఇది ఒత్తిడిలో ఊపిరితిత్తుల స్పందనలను కొలుస్తుంది. దీనిని లంగ్ రిక్రూటబిలిటీ అని కూడా అంటారని పరిశోధకుల్లో ఒకరైన హైబొ క్యూ తెలిపారు.
"బాధితుల్లో ఊపిరితిత్తుల వైఖరిని తెలిపిన తొలి స్టడీ ఇదే. అధిక ఒత్తిడికి రోగులు స్పందించలేరు. ప్రోన్ పొజిషనింగ్‌తో ఊపిరి పీల్చుకోవడం సులభం అవుతుంది. "
--- హైబొ క్యూ, పరిశోధకులు
12మందిలో ఏడుగురికి ఒక్కసారైనా ప్రోన్ పొజిషనింగ్ సెషన్ నిర్వహించారు. మరో ముగ్గురు ప్రోన్ పొజిషనింగ్‌తో పాటు ప్రాణధార వ్యవస్థపై చికిత్స పొందారు. మరో ఇద్దరు మరణించారు. ప్రోన్ పొజిషనింగ్ అందించని వారికి లంగ్ రిక్రూటబిలిటీ చాలా తక్కువగా ఉందని పరిశోధనలో తేలింది.
మరోవైపు ముఖాన్ని కిందకు వంచి ఊపిరి తీసుకుంటే ఊపిరితిత్తుల సమస్య తగ్గుతుందని పరిశోధన స్పష్టం చేసింది.
అయితే తక్కువమందిపై ఈ పరిశోధన చేయడం వల్ల... అధిక జనాభా విషయంలో ఫలితాల్లో మార్పువచ్చే అవకాశముందని పరిశోధకులు అంటున్నారు.
ఇదీ చూడండి:- కరోనా సెలవుల్లో పెరిగిన కండోమ్ అమ్మకాలు