2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో భారత సంతతి మహిళ కమలా హారిస్ పుంజుకున్నారు. అభ్యర్థిగా నిలవాలని ఆశిస్తున్న డెమొక్రటిక్ పార్టీ నేతల్లో రెండో స్థానానికి ఎగబాకారు. అధ్యక్ష ఎన్నికల ఆశావాహులపై తాజాగా నిర్వహించిన జాతీయ అభిప్రాయ సేకరణలో ఈ విషయం వెల్లడైంది.
అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్ ప్రస్తుతం 22 శాతానికిపైగా ఓట్లతో తొలి స్థానంలో కొనసాగుతున్నారు. కానీ గతవారం ఫ్లోరిడాలో ఆశావహుల మధ్య జరిగిన తొలి బహిరంగ సంవాదం తర్వాత ఆయనపై ప్రజాదరణ తగ్గుతూ వస్తున్నట్లు సర్వేలో తేలింది. ప్రజల్లో పెరుగుతున్న ఆదరణతో 22 శాతం ఓట్లు పొందారు కమల.
"ఎప్పుడూ బిడెన్‌కు మద్దతిచ్చే నల్లజాతి ఓటర్లలోనూ హారిస్‌కు ఆదరణ పెరిగింది. వారి ఓట్లలో బిడెన్‌కు 31 శాతం, హారిస్‌కు 27 శాతం వచ్చాయి. తొలి దశ డెమొక్రటిక్ పార్టీ చర్చ కమల, బిడెన్‌ను రెండు వేరువేరు పంథాలలో నిలిపింది. కమలకు మద్దతు పెరుగుతూ వచ్చింది. కానీ బిడెన్‌కు ప్రజాదరణ తగ్గింది."
-మారి స్నో, క్విన్నిపియాక్ విశ్యవిద్యాలయం పోలింగ్ విశ్లేషకులు
బిడెన్, కమల తర్వాత స్థానాల్లో మాసచుసెట్స్ సెనేటర్ ఎలిజబెత్ వారెన్( 14 శాతం ఓట్లు), వెర్మోంట్ సెనేటర్ బెర్నీ సాండర్స్(13 శాతం ఓట్లు), దక్షిణ బెండ్ మేయర్ పీట్ బుటిగిగ్( 4 శాతం ఓట్లు) ఉన్నారని నివేదిక తెలిపింది. మిగతా వారెవరూ 3 శాతం మించి ఓట్లు దక్కించుకోలేకపోయారు.
భారత సంతతికి చెందిన కమలా హారిస్ ఈ ఏడాది ప్రారంభంలోనే అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అమెరికా సెనేటర్‌గా రెండేళ్ల క్రితం ఎన్నికయ్యారు హారిస్. అధ్యక్షుడు ట్రంప్ విధానాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందారు.
ఇదీ చూడండి: భారత్‌కు నాటో భాగస్వామి హోదా