అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ట్రంప్ శిబిరం ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. రాజకీయంగా, ఆర్థికంగా, జనాభా పరంగా కీలకంగా మారిన భారతీయ అమెరికన్లను ఆకట్టుకునేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్ రెండో కుమారుడు ఎరిక్ ట్రంప్ తన తండ్రి తరపున ఎన్నికల ప్రచారంలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు.
అట్లాంటాలో ఇటీవల జరిగిన ఓ సమావేశంలో ఆయన భారతీయులను ఉద్దేశించి మాట్లాడుతూ.. డెమోక్రటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ తీరును విమర్శించారు. ఆమె స్వయంగా భారతీయ సంతతికి చెందినవారైనప్పటికీ భారతీయ అమెరికన్లను దూరంగా ఉంచారని ఆయన ఆరోపించారు. భారతీయ వారసత్వాన్ని గురించి ఘనంగా చెప్పుకోవటమే తప్ప ఆమె చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. హారిస్ చెప్పే మాటలకు, ఆమె చేసే పనులకు ఎలాంటి సంబంధం లేదని విమర్శించారు. భారతీయ అమెరికన్లు ఎప్పుడూ అత్యుత్తమమైన వారినే ఎన్నుకుంటారని..తన తండ్రి ట్రంప్ కూడా వారినెప్పుడూ నిరాశ పరచలేదని ఆయన అన్నారు. ఎంతో గొప్ప వారసత్వమున్న భారతీయులను తమ కుటుంబమంతా అమితంగా ప్రేమిస్తుందని ఎరిక్ వివరించారు. భారత్ ఓ అద్భుతమైన ప్రజలున్న గొప్ప దేశమని ఆయన ప్రశంసించారు.
ఇటీవల నిర్వహించిన 'ఇండియన్ వాయిసెస్ ఫర్ ట్రంప్' కార్యక్రమ ప్రారంభోత్సవంలోనూ ఎరిక్ ట్రంప్ పాల్గొన్నారు. చైనా, పాకిస్థాన్ అంశాల్లో ట్రంప్ విధానం ఇదివరకటి అధ్యక్షుల కంటే చాలా భిన్నంగా ఉంటుందని ఆయన ప్రకటించారు. గత ప్రభుత్వం చైనాకు వంతపాడిందని, కాగా ఇప్పుడు భారత్‌కే కాకుండా ప్రపంచం మొత్తానికి చైనా చిక్కులు తెచ్చిపెట్టిందన్నారు. మరోవైపు పాక్ సృష్టించే సమస్యలు అందరికంటే మీకే ఎక్కువ తెలుసని భారతీయ అమెరికన్లను ఉద్దేశించి అన్నారు. ట్రంప్ ఎల్లప్పుడూ భారత్ వైపే ఉన్నారని.. భారతీయ అమెరికన్లకు అండగా నిలుస్తారని ఆయన హామీ ఇచ్చారు. కాగా, భారత్-అమెరికా సంబంధాలను బలోపేతం చేసినందుకు, భారతీయ అమెరికన్లకు సహాయంగా నిలిచినందుకు ట్రంప్ కుటుంబానికి వాయిసెస్ ఆఫ్ ట్రంప్ సభ్యుడు రితేశ్ దేశాయ్ కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి:- 'కమల' అధ్యక్షురాలైతే అమెరికాకే అవమానం: ట్రంప్