అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఫెడరల్ కోర్టులో చుక్కెదురైంది. దేశంలో అత్యవసర స్థితి విధించి సరిహద్దు గోడ నిర్మాణానికి నిధులు సమీకరించుకోవాలనుకున్న ప్రయత్నాలకు అడ్డుకట్ట పడింది. రక్షణ శాఖ నిధులను మళ్లించేందుకు చేపట్టిన పరిపాలనా పరమైన ప్రయత్నాలను నిలిపేస్తూ జిల్లా కోర్టు న్యాయమూర్తి జస్టిస్ హేవుడ్ గిలియమ్ తీర్పు వెలువరించారు.
మెక్సికో సరిహద్దులోని రెండు ప్రాంతాల్లో 51 మైళ్ల మేర నిర్మించే రెండు ప్రాజెక్టులను శనివారం ప్రారంభించాలని నిర్ణయించారు. కోర్టు ఆదేశాలతో ట్రంప్ ప్రయత్నాలకు గండి పడింది.
ఈ అంశంపై కాలిఫోర్నియాతో సహా 20 రాష్ట్రాలు పిటిషన్ దాఖలు చేశాయి. వాటితో పాటు సియెర్రా క్లబ్, సరిహద్దులోని వివిధ సంఘాల ఆధ్వర్యంలో మరో పిటిషన్ దాఖలైంది. ఈ రెండు పిటిషన్లపై గత వారం విచారణ చేపట్టారు జస్టిస్ గిలియమ్.
సరిహద్దు గోడ నిర్మాణానికి నిధులు సమకూర్చడానికి అంతకుముందు 35 రోజుల పాటు ప్రభుత్వాన్ని పాక్షికంగా మూసివేశారు ట్రంప్. నిధుల విడుదలకు డెమొక్రాట్లు అంగీకరించాల్సిందేనని ట్రంప్ పట్టుబట్టారు. కానీ వారి నుంచి ఎలాంటి ఆమోదం లభించకపోవటం వల్ల ఫిబ్రవరిలో జాతీయ అత్యయిక స్థితి విధించారు.
అనంతరం దిగివచ్చిన కాంగ్రెస్ 1.375 బిలియన్ డాలర్లు ఇచ్చేందుకు అంగీకరించింది. సరిహద్దు గోడ నిర్మాణానికి కావాల్సిన 8 బిలియన్ డాలర్లను ఇతర ప్రభుత్వ విభాగాల నుంచి సమకూర్చుకునేందుకు అత్యవసర స్థితిని కొనసాగించారు ట్రంప్. అధ్యక్షుడి నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తాయి.
ఇదీ చూడండి: మధ్యప్రాచ్యంలో భారీగా బలగాల మోహరింపు: అమెరికా