అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ కరోనా టీకా తీసుకున్నారు. డెలావర్‌లోని క్రిస్టియానా ఆసుపత్రిలో 78 ఏళ్ల బైడెన్ ఫైజర్ టీకా మొదటి డోసు తీసుకున్నారు. బైడెన్ వ్యాక్సినేషన్ ఈ ఘట్టాన్ని అమెరికా ఛానళ్లు ప్రత్యక్షప్రసారం చేశాయి.
టీకా తీసుకున్న సందర్భంగా బైడెన్ మాట్లాడుతూ.. " టీకా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రజల్లో అపోహను తొలగించేందుకే టీకా వేసుకుంటున్నాను. టీకా వేసుకోవడానికి ప్రజలు సన్నద్ధంగా ఉండాలి. నేను టీకా రెండో డోసు తీసుకోవడానికి ఎదురుచూస్తున్నాను" అని బైడెన్ తెలిపారు. టీకా తీసుకుంటున్న సందర్భంగా బైడెన్ సతీమణి జిల్ బైడెన్ ఆయన పక్కనే ఉన్నారు. ఆమె అంతకు ముందురోజే టీకాను తీసుకున్నారు.
ఫైజర్ వ్యాక్సిన్‌కు అమెరికా ఆహార, ఔషద నియంత్రణ సంస్థ(ఎఫ్‌డీఏ) అనుమతి లభించిన నేపథ్యంలో భారీ ఎత్తున టీకా కార్యక్రమం మొదలైంది. గత వారం నుంచే అమెరికాలో పెద్దఎత్తున కరోనా టీకాను ఫ్రంట్ లైన్ వర్కర్లు అయిన ఆరోగ్య సిబ్బందికి ఇస్తున్నారు. క్రిస్మస్ సెలవుల నేపథ్యంలో ప్రజలంతా మాస్క్‌లు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని జోబైడెన్ మరోసారి అమెరికన్లకు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: కరోనా సమాచారంపై చైనా కుట్ర నిజమే..