Joe Biden Christmas: క్రిస్మస్ వేడుకల్లో భాగంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. సైనికాధికారులతో ముచ్చటించారు. అధ్యక్ష హోదాలో తొలిసారి క్రిస్మస్ జరుపుకున్న ఆయన.. సైన్యంలోని అధికారులు, ఉద్యోగులకు ఫోన్లు చేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో విధులు నిర్వహిస్తున్న అమెరికా ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, స్పేస్ ఫోర్స్, కోస్ట్ గార్డ్ సిబ్బందిని పండగ సందర్భంగా పలకరించారు. దేశానికి చేస్తున్న సేవలను కొనియాడారు.
ఆయనతో పాటు అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్, వారి కుటుంబంలోకి కొత్తగా వచ్చిన పెంపుడు శునకం కమాండర్ సైతం.. సైనికులకు చేసిన వీడియో కాల్స్‌లో పాల్గొన్నారు.
"దేశానికి మీరు చేస్తున్న సేవలకు కృతజ్ఞతలు. మీ ధైర్యానికి, త్యాగానికి, మీ కుటుంబ సభ్యుల త్యాగానికి మేం ధన్యులం. సైనికులు, వారి కుటుంబ సభ్యుల సంరక్షణ మా పవిత్ర బాధ్యత. దేశానికి వెన్నుముక మీరే."
-జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు
ఈ సందర్భంగా సైనికులతో మాట్లాడిన ప్రథమ మహిళ జిల్ బైడెన్.. క్రిస్మస్ రోజున కుటుంబసభ్యులకు దూరంగా ఉండటం కష్టమేనని అన్నారు. తమ కుమారుడు సైన్యంలో పనిచేసినప్పుడు తాము సైతం అలాంటి సందర్భాన్ని ఎదుర్కొన్నట్లు గుర్తుచేసుకున్నారు.
నిరాడంబరంగానే..
అధ్యక్షుడిగా తొలి క్రిస్మస్ వేడుకలను నిరాడంబరంగా జరుపుకున్నారు బైడెన్. శుక్రవారం రాత్రి ప్రథమ మహిళ జిల్‌తో కలిసి వర్చువల్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం తన కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడిపారు. శనివారం.. జాతీయ పిల్లల ఆస్పత్రిని జిల్‌తో కలిసి సందర్శించారు. అక్కడి చిన్నారులతో సరదాగా మాట్లాడారు.
ఇదీ చదవండి: ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు- కాంతులీనిన చర్చిలు